Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ విలేకర్ల ముందు కన్నీరు
- ఈనెల 23న చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా కౌన్సిలర్ల సంతకాలు
నవతెలంగాణ-జగిత్యాలటౌన్
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. కౌన్సిలర్లను అడ్డుపెట్టుకుని తనను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజరు వేధిస్తున్నారంటూ చైర్పర్సన్ కన్నీరు పెట్టుకుంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జగిత్యాల పట్టణంలో బుధవారం విలేకర్ల సమావేవంలో ఆమె మాట్లాడారు. ప్రశ్నిస్తున్నామన్న కోపంతో ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ''మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి.. జాగ్రత్త'' అంటూ బెదిరించడంతోపాటు డబ్బుల కోసం కూడా డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చుకునే పరిస్థితుల్లో తాము లేమని చెప్పినా వినిపించుకోకుండా అహంకారపూరితంగా వ్యవహరించారన్నారు. బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక తనపై కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు అడ్డొస్తూ, తనకు చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులూ చేయొద్దని హుకుం జారీ చేస్తున్నారని చెప్పారు. తాను నరక ప్రాయంగా మున్సిపల్ చైర్పర్సన్ పదవిలో కొనసాగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుడి పెట్రోల్ బంకు కోసం జంక్షన్ చిన్నగా చేసి కట్టారని, డివైడర్ ఎత్తు తగ్గించారని తాను అధికారులను అడిగితే ''నీకు సంబంధం లేని విషయం'' అంటూ వారి ముందే ఇష్టారీతిన ఎమ్మెల్యే అవమానించారని ఆమె వాపోయారు. మూడు ఏండ్లుగా నరకం అనుభవిస్తున్నానని, ప్రజాసేవలో నిమగం అయిన తనను నిత్యం వేధింపులకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారని, చివరకు వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టినా తప్పేనంటూ మాట్లాడారని ఆరోపించారు. ఆర్డీఓ కన్నా తక్కువ ప్రొటోకాల్ ఉండే మున్సిపల్ చైర్పర్సన్ పదవిలో ఉండి జిల్లా స్థాయి అధికారులను ఎలా కలుస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడం సరికాదని, అవిశ్వాసం కూడా ఆయన ఆడిన డ్రామానేనని ఆమె ఆరోపించారు. సస్పెండ్ చేస్తానని కమిషనర్‌ను బెదిరించడంతోనే ఆయన లీవ్‌పై వెళ్లిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కనీసం తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని, ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలని శాసించారన్నారు. మంత్రి కేటీఆర్‌ను, ఎమ్మెల్సీ కవితను కలవకూడదని ఒత్తిళ్లకు గురి చేశారన్నారు. సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లు ప్రస్తావించకూడదని హుకుం జారీ చేశారని ఆరోపించారు. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే, ఈనెల 23న అధికార పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా సంతకాలు చేసి ఆ పత్రాన్ని ఎమ్మెల్యే సంజరుకుమార్కు అందజేశారు. కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానానికి సిద్దమౌతున్న తరుణంలో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.