Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరమైతే చట్టాలు మారుద్దాం
- స్కూళ్లు, ఆస్పత్రులు సహా భవనాలన్నీ తనిఖీ చేయండి
- అగ్నిప్రమాద మృతులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో భారీ, ఎత్తయిన భవనాలు, వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, అపార్టుమెంట్లలో సేప్టి ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రులు నిర్ణయించారు. సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందచేయాలని ఆదేశించారు. సికింద్రాబాద్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ అనుమతులు లేని భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బీఆర్కే భవన్లో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హౌంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ డిప్యూటి మేయర్ మోతే శ్రీలత రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇంధన, గహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేష్‌కుమార్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ అమోరు కుమార్, మేడ్చల్ కలెక్టర్ హరీష్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రధాన నగరాల్లోని ఎత్తైన భవనాల్లో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఫైర్ సేప్టి ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని చెప్పారు. ఆస్పత్రులు, పాఠశాల భవనాలు, పెట్రోల్‌బంకులు, గ్యాస్ గోదాములు, వ్యాపార, వాణిజ్య భవనాలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేప్టి ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని చెప్పారు. దీనికోసం అవసరమైతే 1999 నాటి ఫైర్‌సేఫ్టీ చట్టాలను మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని సూచించారు. అగ్నిమాపకశాఖకు ఆధునిక వాహనాలు, అగ్నిమాపక యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, దీనికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు. రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఫైర్‌సేఫ్టీపై మార్గదర్శకాలు సూచించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 25 లక్షల వ్యాపార, వాణిజ్య సముదాయాలున్నాయనీ, ఇవన్నీ తమ స్వంత ఫైర్ సేప్టీ జాగ్రత్తలు తీసుకునేవిధంగా మార్గదర్శకాలు జారీ చేయాలని చెప్పారు. హౌం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే సమయంలోనే ఫైర్‌సేఫ్టీపై కఠిన నిబంధనలు విధించాలని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సమర్పించడానికి ఉన్నతస్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.