Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ హయాంలో మారని ఆదాయ పన్ను శ్లాబులు
- ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌పై ఉద్యోగుల్లో ఆశలు
- రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపునివ్వాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చేనెల ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే 2023-24 వార్షిక బడ్జెట్‌పై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాదిలో పార్లమెంటుకు ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకూ అనుకూలమైన బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు. అందులో భాగంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. రూ.ఐదు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలంటూ 2015 నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను శ్లాబులే అమలవుతున్నాయి. అయితే ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచలేదు కానీ శ్లాబుల్లో మార్పు చేసింది. అంటే రూ.2.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2014 నుంచి ఇదే పద్ధతి కొనసాగుతున్నది. ఏటా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిలో మార్పు ఉంటుందని వేతన జీవులు ఆశించి భంగపాటుకు గురికావడం పరిపాటిగా మారింది. ఆ పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచాలంటూ 2013లో అప్పటి బీజేపీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దాన్ని విస్మరించడం గమనార్హం. అయితే ఇది ఎన్నికల బడ్జెట్ కావడంతో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం పెంచుతుందన్న ఆశల్లో వేతన జీవులున్నారు. ఈసారి ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.
రూ.5 లక్షలకు పెంచాలి : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షలకు పెంచాలి. పొదుపు మొత్తాలపై ఇచ్చే రాయితీలను రూ.మూడు లక్షలకు పొడిగించాలి. వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించాలి.
రూ.10 లక్షలకు పెంచాలి : ఎం రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షులు
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. కేంద్ర ప్రభుత్వం కొత్త శ్లాబులను ప్రకటించాలి. 2015లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచా లని కోరాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మార్పులొచ్చాయి. కానీ శ్లాబుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. సీపీఎస్‌ను కూడా కేంద్రం రద్దు చేయాలి.