Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా తర్వాత ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు
- దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇవే పరిస్థితులు
- 2022లో నమోదు 72.9 శాతానికి పెరుగుదల : నివేదిక
కరోనా తర్వాత పేద,మధ్యతరగతి బతుకులు చెల్లాచెదురయ్యాయి. ఉపాధికి దూరమై..పనికోసం తంటాలు పడేస్థితికి చేరుకున్నాయి. తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి...అప్పో సొప్పో చేసి ప్రయివేటు బడులకు పంపేవారు. కానీ ఇపుడు వారి చదువు కోసం పైసల్లేక ..ప్రభుత్వ బడులకు పంపక తప్పటంలేదు. ఇదే ప్రథమ్ సర్వేలో వెల్లడైంది.
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి రాక తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అనేక మంది చిన్నారులు ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. 17వ దేశవ్యాప్త వార్షిక విద్యాస్థితి (ఏఎస్ఈఆర్) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 616 జిల్లాల్లోని దాదాపు ఏడు లక్షల మంది చిన్నారులను కవర్ చేస్తూ ఈ నివేదికను రూపొందించారు. ఈ సర్వేను ప్రథమ్ ఎన్జీవో నిర్వహించింది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. 2018-2022 మధ్యలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారుల నమోదు పెరిగింది. కోవిడ్ మహమ్మారి అనంతరం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రయివేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను తీసుకున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో ప్రభుత్వ స్కూళ్లలో చేరిన పిల్లల సంఖ్య 65.6 శాతంగా ఉండగా.. 2022లో అది 72.9 శాతానికి పెరిగింది. ఆరు నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్న చిన్నారుల్లో 98.4 శాతం మంది ప్రస్తుతం ఒక రకమైన సరైన విద్యలో నమోదు చేయబడ్డారు.
మరోపక్క, అన్ని తరగతుల స్కూల్ చిన్నారుల పఠనాశక్తి 2012కు ముందు స్థాయి వరకు పడిపోయాయి. అలాగే కనీస గణిత నైపుణ్యాలు 2018 స్థాయిలకు పడిపోవటం గమనార్హం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో బాల,బాలికల గైర్హాజరు కనిపించింది. రెండో తరగతి స్థాయి పాఠాలను చదవగలిగే మూడో తరగతి పిల్లల శాతం ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో 2018లో 27.3 శాతం నుంచి 2022లో 20.5 శాతానికి పడిపోయింది. ఈ తగ్గుదల ప్రతి రాష్ట్రంలోనూ కనిపించింది. 2018లో పఠనా స్థాయి అధికంగా ఉన్న రాష్ట్రాలలో అదే ఏడాది నుంచి పది శాతం కంటే ఎక్కువ పాయింట్లు పడిపోయిన రాష్ట్రాల జాబితాలో హిమాచల్ ప్రదేశ్ (47.7 శాతం నుంచి 28.4 శాతం), హర్యానా (46.4 శాతం నుంచి 31.5 శాతం) లు ఉన్నాయి.