Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా కర్షకుల ట్రాక్టర్స్ మార్చ్
- మిర్యాలగూడలో పెద్దఎత్తున ర్యాలీ
- మద్దతు తెలిపిన ప్రజాసంఘాలు
- రైతు వ్యతిరేక విధానాలు తెస్తే మోడీని గద్దె దింపుతాం: నేతలు
నవతెలంగాణ- మిర్యాలగూడ/విలేకరులు
''రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మోడీని గద్దె దింపుతాం.. రైతుల ఆందోళనతో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ సమయంలో రైతులకిచ్చిన హామీలను విస్మరించింది.. 9 హామీలను వెంటనే అమలు చేయాలి.. పార్లమెంటులో కనీస మద్దతు ధర చట్టం చేయాలి'' అని రైతుల టాక్టర్స్ మార్చ్‌లో నేతలు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రైతులు టాక్టర్స్ మార్చ్ నిర్వహించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అఖిలభారత కిసాన్ సభ (రైతు సంఘం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతులు ట్రాక్టర్ల ర్యాలీ తీశారు. కిలోమీటర్ పొడవునా టాక్టర్లు బారులు తీరాయి. ప్రతి ట్రాక్టర్‌పై ఆకుపచ్చ జెండాలు పెట్టి ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనను సంఘం జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తే మోడీని ఇంటికి సాగనంపుతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలన్నారు. కనీస మద్దతు ధర చట్టంతోపాటు రైతులకు బోనస్ అందించి ఆదుకోవాలన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించే ఆలోచనలను మోడీ ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులను అరికట్టి నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. సబ్సిడీపై యూరియా, విత్తనాలు ఇవ్వాలని కోరారు. 50 ఏండ్లు నిండిన రైతులందరికీ రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని, పది లక్షల మంది రైతులతో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. చలో ఢిల్లీకి రైతులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కేంద్రం.. : చెరుపల్లి
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుల వీరోచిత పోరాటంతో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని మోడీ.. ఆ విధానాలనే అనుసరిస్తూ వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు పెరిగి అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. పేద ప్రజలు, రైతులు రోజు రోజుకూ మరింత పేదలుగా మారుతుంటే అదానీ, అంబానీ వంటి పారిశ్రామికవేత్తల ఆస్తులు రెండు వందల రెట్లు పెరిగి ప్రపంచ కుబేరుల వరుసలో మొదటి, రెండో స్థానాలకు ఎగబాకారని చెప్పారు. ప్రజల ఆస్తులైన రైల్వే, విమాన యానం, ఓడ రేవులు, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్ముతున్నారని విమర్శించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకార్‌రెడ్డి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. మునుగోడులో రైతు సంఘం(సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, రైతు సంఘం(సీపీఐ) రాష్ట్ర నాయకులు నెల్లికంటి సత్యం ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంట ధరలు లేక.. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడిలో 80శాతం కూడా రైతులకు చేతికి రాక రుణగ్రస్తులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అన్ని రకాల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు కొప్పోజు సూర్యనారాయణ, అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెవిలియన్ మైదానం నుంచి కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పెవిలియన్ మైదానంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దుపై బీజేపీ ప్రభుత్వం భారతదేశ రైతాంగాన్ని మోసం చేసిందని, ఇప్పటి పార్లమెంటు సమావేశాల్లో కూడా ఆ చట్టాల రద్దు బిల్లును ఎజెండాలోకి తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల మోడీ సర్కార్ తీరు మారకుంటే మరో రైతాంగ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
నూటికి 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలుగా ఇవ్వడమేగాక చట్ట సవరణ చేసి కార్పొరేట్ రుణాలను రద్దు చేస్తున్న కేంద్రం.. రైతుల అప్పులకు సంబంధించి మాత్రం కనీస ఆలోచన చేయడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్, బైక్ ర్యాలీ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐ గ్రౌండ్ నుంచి ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ నాయకుడు కె.భూమయ్య మాట్లాడారు.
సిద్దిపేటలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి సిద్దిపేట పాత బస్టాండ్ మీదుగా ముస్తాబాద్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ సాగింది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండి జబ్బార్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహించారు.