Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపేదలకు ఇండ్ల పట్టాలు వచ్చే వరకు ఉద్యమాలు
- గుడిసెవాసులకు అండగా ఉంటాం
- ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య
- భూపాలపల్లి, చిల్పూర్‌లో గుడిసెల సందర్శన
నవతెలంగాణ-భూపాలపల్లి/స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేండ్లు గడుస్తున్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని, పెద్దోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయమని, నిరుపేదలకు ఇండ్ల పట్టాలు వచ్చేవరకు పోరాడుడే.. అని ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య స్పష్టంచేశారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు శిఖం భూమిలోని సర్వే నెంబర్ 280, 283, 284, 285లలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇంటి స్థలాల పోరాటం చేపట్టి సుమారు 500మంది బుధవారం గుడిసెలు వేయగా, వారిని గురువారం కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ, సీఐటీయూ రాష్ట్ర నాయకులు మాధవితో కలిసి వీరయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అనేక వాగ్ధానాలు ఇచ్చినప్పటికీ నేటి వరకు అమలు కాలేదన్నారు. ఇప్పుడు కొత్తగా.. సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని, తదనందరం రూ.3లక్షలు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని ఆరోపించారు. నిరుపేదలకు 100 గజాల ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా భూపోరాట సెంటర్లలో ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు నడుస్తున్నాయని తెలిపారు. గతేడాది నుండి భూపోరాటాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు వేసుకున్న ఈ భూమి.. ప్రభుత్వ అధికారులు శిఖం భూమి అంటూ చెబుతున్నప్పటికీ, ఈ చెరువుకు గండి ఎందుకు కొట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలపై అక్రమ కేసులు పెట్టినా, గుడిసెలు కూల్చినా సహించేది లేదని, సీపీఐ(ఎం) వారికి అండగా ఉండి ఇంటిస్థలం దక్కేవరకు పోరాడుతుందని భరోసా ఇచ్చారు. మతోన్మాద బీజేపీని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపిన గడ్డపై అడుగుపెట్టనీయకుండా అడ్డుకునేందుకు మాత్రమే బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచామని తెలిపారు. ప్రజా సమస్యలపై రాజీపడ బోమని తెలిపారు. సమస్యలను పరిష్కరించలేని లేనిపక్షంలో ప్రభుత్వంపై ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అంతకు ముందు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో 79 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని పోరాడుతున్న గుడిసె వాసులకు మద్దతుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టిన కార్యక్రమంలో వీరయ్య పాల్గొని మాట్లాడారు. గుడిసెవాసులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపెటి రాజన్న, చెన్నూరి రమేష్,పొలం రాజేందర్, దామెర కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు వ్యకాస జిల్లా కార్యదర్శి ఎదునూరి వెంకట్రాజం, భూ పోరాట కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.