Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ల సంఘాల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ)కి ఎన్నికలు నిర్వహించకపోతే హైదరాబాద్ వైద్యగర్జన నిర్వహిస్తామని డాక్టర్ల సంఘాలు హెచ్చరించాయి. తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో టీఎస్ఎంసీ ఎన్నికలు, నకిలీ వైద్యం నుంచి ప్రజారోగ్య రంగాన్ని పరిరక్షించుకోవడం, బలోపేతం చేయడం అనే అంశంపై నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ డీఏ), తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) నాయకులు పాల్గొన్నారు. టీడీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలోపు ఎన్నికలు నిర్వహించకుంటే వైద్య గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ప్రాక్టీసింగ్ డాక్టర్లతో వైద్య గర్జన నిర్వహిస్తామని హెచ్చరించారు. హెచ్ఆర్డీఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తక్షణం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ మహేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ వైద్యం నాటుసారా మాదిరిగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రులు, డాక్టర్లు రోగుల నుంచి వసూలు చేస్తున్న బిల్లుల నుంచి 30 నుంచి 70 శాతం సిఫారసు చేసిన నకిలీలకు చెల్లిస్తుండటంతో పేద రోగులపై ఆర్థిక భారం పెరగడానికి కారణమన్నారు. 12 ఏండ్ల నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బీ.ఎన్.రావు మాట్లాడుతూ నకిలీలను ప్రోత్సహించడం మానుకోవాలని డాక్టర్లకు హితవు పలికారు. నకిలీలకు పునాది ఇక్కడే ఉందని తెలిపారు. వైద్యవృత్తిని పరిరక్షించుకునేందుకు డాక్టర్లు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. నకిలీలకు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నుంచి సహకారం లభిస్తున్నదని తెలిపారు. టీజూడా ప్రతినిధులు డాక్టర్ కౌశిక్, డాక్టర్ రాహుల్, డాక్టర్ కర్షిణి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి వైద్య విద్యార్థిని కదలిస్తామని తెలిపారు. టీడీఎఫ్ కన్వీనర్ డాక్టర్ విజయేందర్ మాట్లాడుతూ భారత ప్రజారోగ్య ప్రమాణాల మేరకు పెరిగిన జనాభాకు తగినట్టు మెడికల్ సీట్లను, ఆస్పత్రులను పెంచాలని కోరారు. అదే సమయంలో బోధన, బోధనేతర ఆస్పత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్ఎంసీ ఎన్నికల కోసం హెచ్ఆర్డీఏ చేస్తున్న పోరాటాన్ని ఆయా సంఘాల నాయకులు అభినందించారు.
సంబంధిత అధికారులకు వినతిపత్రాలను సమర్పించాలనీ, అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్లో మెడికోల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని తీర్మానించారు.