Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర చరిత్రలో ఇప్పటికే 91 మంది ఉన్నతాధికారుల బదిలీ
- మరోవిడతలో ఇన్స్పెక్టర్ నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు
- పోలీసు శాఖలో సాగుతున్న కసరత్తు?
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలో ఒకేసారి 91 మంది పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం మరోవిడతలో ఇదే స్థాయిలో బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది చివరలోనే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు శాఖలో జరిగిన బదిలీలు ఎన్నికల బదిలీలుగానే వినిపిస్తున్నది. తాజాగా జరిగిన ఉన్నతాధికారుల బదిలీల్లో 51 మంది వరకు ఐపీఎస్ అధికారులు కాగా మరో 40 మంది నాన్‌కేడర్ ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. ముఖ్యంగా, అదనపు ఎస్పీ స్థాయి నుంచి డీఐజీ స్థాయి అధికారుల వరకు స్థాన చలనం కలిగిన వారిలో ఉన్నారు. కొందరు అధికారులను ఏడాదిన్నర గడవక ముందే.. వారు ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి బదిలీ అయ్యారు. కాగా, మరికొందరు అధికారులకు ప్రభుత్వం తమ ఇష్టపూర్వకంగా కొన్ని కీలకమైన పోస్టులను కట్టబెట్టినట్టుగా తెలుస్తున్నది. అందులో రెండు కమిషనర్ పోస్టులు ఉండగా.. మరో 8 వరకు జిల్లాల ఎస్పీ పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా, ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రాష్ట్ర పోలీసు శాఖలోని కొన్ని విభాగాల్లో బదిలీలు జరపాల్సిన అవసరం ఉన్నదని గత డీజీపీ మహేందర్‌రెడ్డి హయాంలోనే చాలా వరకు కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. కొత్త డీజీపీ అంజనీకుమార్ వచ్చాక మరికొన్ని జిల్లాల పోస్టులకు సంబంధించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. సైబర్‌క్రైమ్, యాంటీ నార్కోటిక్స్, విజిలెన్స్, సీఐడీ, ఇంటెలిజెన్స్, గ్రే హౌండ్స్ విభాగాలలో పోలీసు ఉన్నతాధికారులు సూచించిన అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చిన ప్రభుత్వం కమిషనరేట్లు, జిల్లాలలో తమకు అనుకూలురైన అధికారులకు పోస్టింగ్‌లను కట్టబెట్టినట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము సూచించిన అధికారులకే పోస్టింగ్‌లు వచ్చేలా చూసుకున్నారని పోలీసు శాఖలో ఊహాగానాలు సాగుతున్నాయి. కొందరు అధికారులకు ఎప్పటిలాగానే తాము కోరుకున్న లా అండ్ ఆర్డర్ పోస్టింగ్‌లు దక్కాయానీ, తమ లాంటి వారికి అంతగా ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లే వచ్చాయని కొందరు ఎస్పీ స్థాయి అధికారులు చిర్రుబుర్రులాడుతున్నట్టు తెలిసింది.
ఇటీవలనే ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు 23 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే. తాజాగా 91 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం త్వరలోనే మరికొందరు ఐపీఎస్ అధికారులను అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీనితో పాటు మలివిడతలో ఇన్స్పెక్టర్ స్థాయి మొదలుకొని అదనపు ఎస్పీ స్థాయి అధికారుల బదిలీలు జరపడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే పోలీసు శాఖలో బదిలీల వేడి రాజుకోవడంతో కొందరు అధికారులు తమకు అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం తెర వెనకగా ముమ్మరంగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలిసింది.