Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలో 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను చేపట్టింది. 13 జిల్లాల్లో వాటిని చేపట్టకుండా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులు గత కొంతకాలంగా స్పౌజ్ బదిలీలను చేపట్టాలంటూ నిరసనలు వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. 12 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ దంపతుల బదిలీలను చేపట్టాలని నిర్ణయించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 615 మంది స్పౌజ్ టీచర్లను బదిలీ చేస్తున్నామని తెలిపారు. అయితే సూర్యాపేట మినహా మిగిలిన 12 జిల్లాల్లో 427 మంది ఉపాధ్యాయులను ప్రస్తుతం బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు.
మిగిలిన స్పౌజ్ బదిలీలు చేపట్టాలి : వివేక్
రాష్ట్రంలో 615 మంది స్పౌజ్ టీచర్ల బదిలీలకు ప్రభుత్వం అనుమతినివ్వడాన్ని స్వాగతిస్తున్నామని స్పౌజ్ టీచర్ల ఫోరం కన్వీనర్ వివేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా టీచర్లు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకొనైనా 13 జిల్లాల్లో మిగిలిన స్పౌజ్ బదిలీలను కూడా సాధ్యమైనంత తొందరలోనే జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.