Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది 34 వేల కోట్ల రికార్డు టర్నోవర్ దిశగా సింగరేణి
- బొగ్గు రంగంలో స్వయం సవృద్ధి దిశగా భారత్ ముందడుగు : సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్
- సింగరేణి భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా సింగరేణి రానున్న ఐదేండ్ల కాలంలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తుందని సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ తెలిపారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థ గతేడాది 26 వేల కోట్ల టర్నోవర్ సాధించిందని, ఈ ఏడాది సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.34 వేల కోట్ల టర్నోవర్ సాధించే దిశగా ముందుకు దూసుకుపోతోందని తెలిపారు. దేశంలో ప్రతి ఏడాది 7 నుంచి 10 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతోందని దీనికనుగుణంగా బొగ్గుకు కూడా డిమాండ్ పెరుగుతోందన్నారు. సింగరేణి వంటి సంస్థకు ఇదొక సదవకాశమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న ఐదేండ్లలో పది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సింగరేణి సంసిద్ధమైంద న్నారు. ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా మరో మూడేండ్లలో విదేశీ బొగ్గు దిగుమతులకు స్వస్తి పలకాలని యోచిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా, సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు 1200 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించిందని, వీటితో పాటు కొన్ని ప్రయివేటు సంస్థలకు కూడా కొత్త బొగ్గు బ్లాక్‌లను కేటాయించడం జరిగింద న్నారు. పర్యవసానంగా రానున్న కాలంలో బొగ్గు మార్కెట్లో ప్రయివేటు బొగ్గు ఉత్పత్తిదారులతో కొంత పోటీ నెలకొం టుందని, అయినప్ప టికీ సంస్థ తన పనితీరు, అనుభవం, క్రమ శిక్షణ వల్ల పోటీ మార్కెట్ తట్టుకోగలదని స్పష్టంచేశారు. ప్రతి కార్మికుడు ఉత్పాదకత పైన దృష్టి సారిస్తే, ఉత్పత్తి వ్యయం తగ్గి, తక్కువ ధరకే వినియోగదారుడికి బొగ్గు సరఫరా చేసే అవకాశం ఉంటుందని, తద్వారా పోటీ మార్కెట్‌ను ఎదుర్కో గలమని తెలిపారు. తన వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కేవలం ఆరేండ్లలోనే అత్యద్భుతమైన పనితీరుతో 91 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ఇది సింగరేణి పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ పనితీరును గుర్తించి మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించా రని, మరో రెండు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే సోలార్ విద్యుత్ ఉత్పాదనలో ఇప్పటికే 220 మెగావాట్ల ప్లాంట్లు పూర్తి చేశామని, మరో 80 మెగావాట్ల ప్లాంటులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని అనేక సంక్షేమ కార్యక్రమా లను సింగరేణిలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి భవన్లో ఉత్తమ అధికారిగా ఎంపికైన సీనియర్ లా ఆఫీసర్ కొలిశెట్టి కౌశల్‌ను, ఉద్యోగిగా ఎంపికైన సెక్యూరిటీ గార్డ్ సి. రామకృష్ణను ఘనంగా సన్మానించారు. అలాగే, విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్య క్రమంలో అడ్వైజర ్(మైనింగ్) డి.ఎన్ .ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూమెంట్) జె.అల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం(మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, అడ్వైజర్(లా) లక్ష్మణ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.