Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
నవతెలంగాణ-ముషీరాబాద్
మనిషి కేంద్రంగా పేదల పెన్నిధిగా మంచి సినిమాలకు భరోసాగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉన్నదని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అభినందించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షార్ట్ ఫిలిమ్లు, కళారూపాల ప్రదర్శన కోసం దాశరథి థియేటర్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సామాజిక అంశాలతో కూడిన సినిమాలు తీస్తున్న నిర్మాతలను, డైరెక్టర్లను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్యుడికి సినిమాయే ప్రధాన వినోదం అని, కానీ ఆ కాస్త వినోదం దక్కకుండా చేస్తున్నారన్నారు. మంచి సందేశాత్మక సినిమాలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాలు చెబితే నిలువునా తగలబెడుతున్నారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తామున్నామంటూ లఘు చిత్ర పరిశ్రమకు భరోసానివ్వడం సాహసంతో కూడిన నిర్ణయం అని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, టీపీఎస్కేను అభినందించారు. సినిమాలపై పన్నుల భారం తగ్గించాలని, పైరసీ మాఫియాలను అరికట్టాలని, లఘు చిత్రాలను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ.. తక్కువ సమయంతో ఆకర్షణీయంగా ఉండే లఘు చిత్రాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందన్నారు. సందేశాత్మక విభిన్న కథలతో ప్రేక్షకుల్లో విజ్ఞానం వినోదం అందిస్తున్నాయని, దీన్ని ఎస్వీకే ప్రోత్సహిస్తుందని తెలిపారు. లఘు చిత్రాల ప్రదర్శన నిరంతరాయంగా జరుగుతుందని, మనమంతా ఒక్కటే మనుషులే మనకు ముద్దు అంటూ సినిమాలు రావాలని సూచించారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నాయకులు భూపతి వెంకటేశ్వర్లు సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత డాక్టర్ జి.అనుష రెడ్డి, లఘు చిత్రాల ఇన్చార్జి, నటుడు బీడీఎల్ సత్యనారాయణ, సత్య భాస్కర్, ఎస్వీకే బాధ్యులు జి బుచ్చిరెడ్డి, ఎన్.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.