Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పళ్లాలతో హాస్టల్ డైలీవేజ్ కార్మికుల నిరసన
- జిల్లా మంత్రి జోక్యం చేసుకోవాలి..
- 36 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ-ఖమ్మం
హాస్టల్ డైలీవేజ్ కార్మికులకు మూడేండ్లుగా రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఏ క్షణమయినా నిరవధిక సమ్మె చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు హెచ్చరించారు. జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీవేజ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్టీ రోడ్ లేడీస్ హాస్టల్ వర్కర్లు 'కడుపు కాలుతోందని' అన్నం తినే పళ్ళాలు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు నెలనెలా 1న జీతాలు తీసుకుంటున్నారని, కానీ కార్మికులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మంత్రి ఉన్న ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. తక్షణమే మంత్రి జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఒక నెల జీతం రాకపోతేనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులూ పడే పరిస్థితిలో మూడేండ్లుగా జీతాలు ఇవ్వకపోతే వారు ఎంత దుర్భరమైన జీవితం అనుభవి స్తున్నారో అధికారులు గమనించాలని సూచించారు. వెంటనే బకాయిలను విడుదల చేయకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వై. విక్రమ్, కాంపాటి వెంకన్న, ప్రవీణ్, సంతోష్, లక్ష్మి దేవి, వీరమ్మ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.