Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారదర్శకతకు సర్కారు పాతర
- విద్యాశాఖలో బదిలీలలు
- పైరవీలకు పెద్దపీట
- దొడ్డిదారిన టీచర్ల ట్రాన్స్ఫర్లు
- ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వం ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తున్నది. సాధారణ బదిలీలు చేపట్టేందుకు మార్గదర్శకాలతోపాటు షెడ్యూల్‌ను సర్కారు విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. శనివారం నుంచి ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. కానీ దొడ్డిదారిలో అక్రమంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాల విద్యాశాఖలో బదిలీలలు కొనసాగుతున్నాయి. పైరవీలకే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉపాధ్యాయ సంఘం, అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పైరవీలు చేసి ఈ బదిలీల ఉత్తర్వులు పొందినట్టు సమాచారం. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరితోపాటు ఇతర జిల్లాల్లోని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు వారు బదిలీ అవుతున్నారు. ప్రగతి భవన్ ఆదేశాల మేరకే సచివాలయం నుంచి బదిలీ ఉత్తర్వులు పొందుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. నారాయణపేట జిల్లా కోస్గి మండలం గుండుమల్ జెడ్పీహెచ్‌లో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా పనిచేస్తున్న డి సరితను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ జెడ్పీహెచ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నల్లచెరువు ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎన్ మాధవిని అదే జిల్లా హయత్‌నగర్‌లోని ఎన్జీవో కాలనీ ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేశారు. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇంకా చాలా మందిని అక్రమంగా దొడ్డిదారిలో బదిలీ చేసినట్టు విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే పారదర్శకతకు పాతర వేస్తున్నదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు సాధారణ బదిలీలు జరుగుతుంటే ఇంకోవైపు దొడ్డిదారిన పైరవీలు చేయడమేంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గిదేం విధానమని ఉపాధ్యాయులు కూడా విమర్శిస్తున్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయ్యే వరకు టీచర్లకు సెలవులు ఇవ్వొద్దంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసి ఇప్పుడు దొడ్డిదారి బదిలీలకు అనుమతి ఎలా ఇస్తుందని నిలదీస్తున్నారు.
317 జీవో బాధితులకు అన్యాయం
రాష్ట్రంలో 2021, డిసెంబర్ ఆరో తేదీన 317 జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో 22,418 మంది ఉపాధ్యాయులు, 13,760 మంది ఉద్యోగులు కలిపి 36,178 మంది ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లకు బదిలీ అయ్యారు. వారిలో ఎక్కువ మంది వారి సొంత జిల్లా స్థానికతను వదిలి వేరే జిల్లాలకు స్థానికేతరులుగా కేటాయించారు. గతేడాది జనవరి ఏడో తేదీన ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ ముగిసిందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే వారు బదిలీ అయ్యి ఏడాది గడిచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఒక పాఠశాలలో కనీసం రెండేండ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులే బదిలీకి అర్హులని ప్రకటించింది. దీంతో 22,418 మంది ఉపాధ్యాయులు కనీసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందడం లేదు. వారికి ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. ఇంకోవైపు వారిలో చాలా మంది సొంత జిల్లాకు బదిలీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. కానీ దొడ్డిదారిలో మాత్రం కొందరు ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ ఉత్తర్వులిస్తున్నది. మరోవైపు భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. అందులో భాగంగా 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. కానీ 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలపై నిషేధం విధించింది. ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులు కూడా స్పౌజ్ బదిలీలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పలుసార్లు చలో హైదరాబాద్, చలో ప్రగతి భవన్ కార్యక్రమాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు 615 మంది స్సౌజ్ బదిలీలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా వందలాది మంది స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.
పైరవీ బదిలీలు ఆపాలి : యూఎస్పీసీ
ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదలైందో లేదో పైరవీ బదిలీల ప్రహసనం మొదలైందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) విమర్శించింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లోని పట్టణ ప్రాంత పాఠశాలలకు సచివాలయం నుండి నేరుగా బదిలీ ఉత్తర్వులు ఇస్తూ కౌన్సెలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని విమర్శించింది. రాజకీయ పలుకుబడితో జరుగుతున్న పైరవీ బదిలీలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేసింది. బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ కేసులను బదిలీలకు ముందే సర్దుబాటు చేయాల్సి ఉండగా ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి హామీ ఇచ్చిన విధంగా సమస్యలను పరిష్కరించాలని కోరింది. పైరవీ బదిలీలు నిలిపేసి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేసింది.
పారదర్శకతకు అర్థం ఈ బదిలీలేనా? : ఎస్టీయూటీఎస్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహిస్తుందంటూ చెప్పిందని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు తెలిపారు. ప్రభుత్వం దొడ్డిదారిలో బదిలీలు నిర్వహించడమే పారదర్శకతకు అర్థమా?అని ప్రశ్నించారు. ఈ బదిలీలను ఏ విధంగా ప్రభుత్వం సమర్థించుకుంటుందని అడిగారు. పరపతి బదిలీలను రద్దు చేయాలని టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్, ముత్యాల రవీందర్ డిమాండ్ చేశారు.