Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మెన్ జస్టిస్ జి.చంద్రయ్య
నవతెలంగాణ - అడిక్ మెట్
కుల మతాలకతీతంగా సమ సమాజం ఏర్పడాలంటే కులాంతర, మతాంతర వివాహాలు మరింత పెరగాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మెన్ జస్టిస్ డాక్టర్ జి.చంద్రయ్య అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద గురువారం కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు ఎండి వహీద్ అధ్యక్షతన కులాంతర మతాంతర వివాహితుల మేళా 51వ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ నాయకత్వంలో అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం అణగారిన వర్గాలకు కొత్త వెలుగులను ప్రసాదించిందన్నారు. అంటరానితనం, ఇతర అన్ని రకాల వివక్షలను రూపుమాపి వారికి హక్కులను, బాధ్యతలను, అవకాశాలను కల్పించిందన్నారు. తద్వారా వ్యక్తి సమానత్వం, సాంఘిక సమానత్వం, సమాన అవకాశాలు అభివృద్ధి, లింగ సమానత్వం దిశగా కొంత సిద్ధించినప్పటికీ చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల వల్ల ఆచరణలో పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి 1971లో కుల నిర్మూలన సంఘం ఏర్పడిందని తెలిపారు. కుల నిర్మూలన సంఘం ఏర్పడిన తర్వాత కొన్ని వేల కులాంతర, మతాంతర వివాహాలు, ఎన్నో సభలు, సమావేశాలు నిర్వహించారని తెలిపారు. తత్ఫలితంగా నేడు సమాజంలో కులాంతర వివాహాలు విరివిగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం సామాజిక, రాజకీయ పరిస్థితులు కుల, మతాల చుట్టూ తిరుగుతూ మనుషుల మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయన్నారు. కులాంతర, మతాంతర వివాహం చేసుకుంటున్న వారికి రక్షణ కల్పించేందుకు చట్టం తేవాలన్నారు. వారి ఆర్థిక స్థితిగతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిలో కులాంతర, మతాంతర వివాహితులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా కవి జయరాజ్, ప్రముఖ హేతువాది సుబ్బరాజు, న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు గోవర్ధన్, కుల నిర్మూలన సంఘం సలహాదారులు లక్ష్మీ నాగేశ్వర్, గౌరవాధ్యక్షులు గుత్త జోత్స్న, విజ్ఞానదర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్, టీపీఎస్కే కన్వీనర్ రాములు, మానవ వికాస వేదిక జాతీయ అధ్యక్షుడు సాంబశివరావు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, సమతా మిషన్ సీఆర్ శేఖర్, కులాంతర మతాంతర వివాహితుల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణచంద్, కార్యనిర్వాహక కార్యదర్శి బిబిషా పాల్గొన్నారు.