Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- 30న తుది గడువు
- ఫిబ్రవరి 1 నాటికి రెండేండ్ల సర్వీసు ఉన్నోళ్లే అర్హులు
- టీచర్లు 8 ఏండ్లు, హెచ్ఎంలు 5 ఏండ్లు పనిచేస్తే బదిలీ తప్పనిసరి
- మార్గదర్శకాలు, షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదో న్నతుల ప్రక్రియ ప్రారంభంకా నుంది. శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవు తుంది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈనెల 30 వరకు ఉన్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ షెడ్యూల్, మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వు లను (జీవో నెంబర్ 5) గురువారం విడుదల చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతుల ప్రక్రియను చేపడతామని తెలిపారు. కేటగిరీ వారీగా ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితాలు ఆన్లైన్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. శనివారం నుంచి ఈనెల 30 వరకు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని వివరించారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎంఈవోలకు, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు ఈ నెల 31 నుంచి వచ్చేనెల రెండో తేదీలోపు సమర్పించాలని తెలిపారు.
ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలు :
- ఒకే పాఠశాలలో ఫిబ్రవరి ఒకటి నాటికి కనీసం రెండేండ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- ఒకే పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంలు ఐదేండ్లపాటు మిగతా ఉపాధ్యాయులు ఎనిమిదేండ్లు పనిచేస్తే బదిలీ తప్పనిసరి.
- రిటైర్మెంట్కు ముందు మూడేండ్ల సర్వీసు ఉన్న వారి ఇష్ట ప్రకారం బదిలీ ఉంటుంది.
- అన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈనెల 28 నుంచి 30 వరకు స్వీకరిస్తారు.
- ఏప్రిల్ 23న రిలీవ్ అయి 24న బదిలీ అయిన పాఠశాలల్లో చేరాలి.
- స్పౌజ్, వికలాంగులు, పెండ్లికానివారు, వితంతువులకు 10 పాయింట్లు అదనంగా ఉంటాయి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తిస్తుంది.
- ఓడీ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు, గుర్తింపు పొందిన సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 అదనపు పాయింట్లు ఉంటాయి.
- ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే స్పౌజ్ పాయింట్లు వర్తిస్తాయి.
- ప్రధానోపాధ్యాయులకు మల్టీజోన్ స్థాయిలో, ఇతర ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు, పదోన్నతులు జరుగుతాయి.
జీరో సర్వీసు బదిలీలకు అనుమతివ్వాలి : యూఎస్పీసీ
సాధారణ బదిలీల్లో జీరో సర్వీసుతో ఉపాధ్యాయులందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా రెండేండ్ల కనీస సర్వీసు ఉన్న వారే అర్హులని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. ఈ సమస్యలు కొందరు ఉపాధ్యాయుల్లో అసంతృప్తికి కారణమౌతున్నాయని విమర్శించింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి హామీ ఇచ్చిన విధంగా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సాధారణ బదిలీలకు ముందే స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలని కోరింది. స్థానికంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను 317 జీవో పేరుతో స్థానికేతర ప్రాంతాల జిల్లాలకు కేటాయించి ఏడాది పూర్తయ్యిందని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి తెలిపారు. వారికి జీరో సర్వీసును బదిలీ అర్హతగా పరిగణించి సర్వీసు పాయింట్లను కూడా లెక్కించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీరో సర్వీసు ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్, ముత్యాల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 317 జీవో బాధితులను కేటాయించినపుడు పాఠశాలల అవసరం మేరకు మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారని తెలిపారు. జీరో సర్వీసు ప్రాతిపదికన ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని టీఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. 22 వేల మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయి బాధితులుగా ఉన్నారని తెలిపారు. వారికి సత్వరం న్యాయం చేయాలని కోరారు.