Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీలు అమలు చేయకుంటే మోడీ సర్కారును గద్దెదించుతాం : ఎస్కేఎం నేతల హెచ్చరిక
- హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ఇందిరాపార్క్ వరకు ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని రైతాంగానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం జాతీయోద్యమం తరహాలో మరోపోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో రైతాంగ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా నిర్మిస్తామన్నారు. ఎస్కేఎం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎస్కేఎం రాష్ట్ర నాయకులు టి సాగర్, పశ్య పద్మ, రాయల చంద్రశేఖర్, కోటేశ్వర్రావు, జక్కుల వెంకటయ్య, కొండారెడ్డి, కొండల్, ప్రసాదన్న, ప్రజాసంఘాల నాయకులు ఆర్ వెంకట్రాములు, సృజన మాట్లాడుతూ రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల మోడీ తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతోపాటు విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలంటూ సుమారు 13 నెలలపాటు రైతులు ఐక్యంగా పోరాడారని గుర్తు చేశారు. 750 మంది రైతాంగ అమరవీరుల త్యాగాలతో సాగిన ఆ ఉద్యమం ఫలితంగా 2021, డిసెంబర్ తొమ్మిదిన సమస్యలను పరిష్కరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా హామీచ్చిందని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించే చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణబిల్లును రద్దు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పారు. లఖింపూర్‌ఖేరి ఘటనకు బాధ్యులైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని మార్చి రైతులకనుగుణంగా చేయాలన్నారు. చిన్న-సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు నెలకు రూ.ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కౌలు రైతులకు రుణార్హత కార్డులివ్వాలనీ, అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం పోడు సాగుదార్లందరికీ హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి, రైతు సంఘం నాయకులు రాంచందర్, రామకృష్ణారెడ్డి, ముసలయ్య, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, సహాయ కార్యదర్శులు రమేష్, శ్రీకాంత్, నగర కార్యదర్శి ఎం వెంకటేష్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్, పట్నం రాష్ట్ర నాయకులు ప్రసాద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, నాయకులు కిషోర్, మండల వెంకన్న, పీవైఎల్ ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రదీప్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, పీడీఎస్‌యూ అధ్యక్షులు మహేశ్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు గడ్డం శ్యామ్, రిటైర్డ్ వ్యవసాయ శాస్త్రవేత్త సోము మర్ల, రైతు శ్రేయోభిలాషి రవి తదితరులు పాల్గొన్నారు.