Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళి సై ఆవేదన
- రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు ...సీఎస్, డీజీపీ హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'గణతంత్ర వేడుకల విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోలేదు..కనీసం ప్రసంగ పాఠాన్ని కూడా పంపలేదు...' అని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలంటూ రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశానని ఆమె తెలిపారు. అయితే ఆ లేఖను పక్కనబెట్టి రాజ్‌భవన్‌లోనే నిర్వహించుకోవాలంటూ రెండు రోజుల క్రితమే సమాచారమిచ్చారని చెప్పారు. ఇలాంటి విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆమె వ్యాఖ్యానిం చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురు వారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళి సై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు సినీ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. రాష్ట్ర చరిత్ర, విశిష్టత చాలా గొప్పదని అన్నారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ప్రదర్శించిన అంకితభావం చాలా గొప్పదని నివాళులర్పించారు. హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో దూసుకుపోవటం హర్షణీయమని కితాబిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను రాజ్‌భవన్ తప్పకుండా అందిస్తుందని తెలిపారు. ఇదే సమయంలో కొత్త భవనాలను కట్టడాన్ని మాత్రమే అభివృద్ధిగా చూడకూడదని వ్యాఖ్యానించారు. రైతులు, పేదలు, కార్మికులు, ఇలా అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని తెలిపారు. అనంతరం ఆమె పుదుచ్ఛేరికి బయలుదేరి వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా ఉదయం రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లోగానీ, గురువారం రాత్రి అక్కడ ఏర్పాటు చేసిన 'ఎట్ హోం' కార్యక్రమంలో గానీ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. ఆ రెండింటికీ ఆయన గైర్హాజరయ్యారు.