Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపురుగు లాంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆ వ్యవస్థను రద్దు చేయాలని తాము పోరాటం చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఆహ్వానించిన 'ఎట్ హౌమ్' కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. గురువారంనాడిక్కడి సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గవర్నర్ వ్యవస్థ ఒక సాధనంగా ఉపయోగపడుతోందని వివర్శించారు. తమిళనాడు, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాలను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గవర్నర్ ద్వారా ఏదో పేరుతో అలజడులు సష్టించి, ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించి, పార్లమెంట్ ఎన్నికల వరకు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్లో భూ కబ్జా ప్రయత్నాన్ని అడ్డుకుని, భూ పోరాటం చేస్తే, తనతో పాటు మరో 21 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. భూదాన్ భూమి కబ్జా కాకుండా పేదలకు దక్కెందుకు తాము ప్రయత్నిస్తే, తామేదో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పన్నినట్టుగా, తుపాకులు పట్టుకున్నట్టుగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం, నిరంకుశత్వమని అన్నారు.
ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. వరంగల్, హన్మకొండ,సంగారెడ్డి, భూపాల్ ఖమ్మం, కొత్తగూడెం, ఇండ్ల స్థలాలు, పోడుభూముల సమస్యలపై పోరాటం చేస్తున్నామనీ, ప్రజా సమస్యల పరిష్కారంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. వామపక్ష పార్టీలు ప్రభుత్వ పాపాలను భరించాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. భూపోరాటాల్లో పోలీసులు తమపై కేసులు నమోదు చేశారనీ, వాటిలో కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని తీసుకుంటుందా... అని ప్రశ్నించారు. తాము టీఆర్ఎస్కు కొన్ని అంశాల్లో మాత్రమే మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. సమావేశంలో చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ పాల్గొన్నారు.