Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లల ప్రపంచంగా మారిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం
- వేలాదిగా తరలొచ్చిన చిన్నారులు
- ఆకట్టుకున్న కోలాట, జానపద నృత్య ప్రదర్శనలు
- పాటలతో అలరించిన విద్యార్థులు
- అబ్బురపరిచిన వైజ్ఞానిక ప్రదర్శన
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం తెలంగాణ బాలోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. పిల్లల సృజనాత్మక కార్యక్రమాలతో బాలోత్సవం ఉట్టిపడింది. బాలబంధు బిరుదాంకితుడు, బాలసాహిత్యవేత్త చొక్కాపు వెంకటరమణ బాలోత్సవ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత చిన్నపిల్లలంతా గాల్లో బెలూన్లను ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్వీకే మెయిన్ హాల్లో ప్రారంభసభను ప్రముఖ సినీగేయ రచయిత, తెలంగాణ బాలోత్సవం ఆహ్వాన సంఘం అధ్యక్షులు సుద్దాల అశోక్‌తేజ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ..నర్సరీ, ఎల్కేజీ నుంచే చదువుల పేరిట పిల్లలపై విపరీతమైన ఒత్తిడిని పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటపాటలు వేరుగాదనీ, అవి చదువులో భాగమని నొక్కిచెప్పారు. పిల్లలు ఆటపాటల్లో ఎంత చురుకుగా ఉంటే మానసికంగా అంత దృఢంగా తయారవుతారని చెప్పారు. తెలంగాణ బాలోత్సవం ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు సీహెచ్.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..ఈ దేశం మీదే..ఈ ప్రపంచం మీదే..ఈ లోకం మీదే..మునుముందుకెళ్లండి అంటూ పిల్లలను ఆశీర్వదించారు. నిర్మాత, దర్శకులు, కోవిదా సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి. అనూహ్యరెడ్డి మాట్లాడుతూ..జీవితంలో కష్టాలను చూసి భయపడొద్దని పిల్లలకు సూచించారు. వాటిని ఎదురొడ్డి ముందుకెళ్తేనే భవిష్యత్‌లో సుఖపడుతామని చెప్పారు. ప్రతివిద్యార్థీ టీచర్లను గౌరవించాలనీ, వారి మార్గదర్శకంలో ఎదగాలని సూచించారు. అయితే, చదువొక్కటే ప్రపంచంకాదని భావించి సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పిల్లలను భాగస్వాములను చేయాలని తల్లిదండ్రులను కోరారు. విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేశ్ మాట్లాడుతూ..తన మాటలతో పిల్లలను చైతన్యపర్చారు. ఈలల వేయించారు. భవిష్యత్ మీదే అంటూ ప్రోత్సహించారు.
సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ..బాలోత్సవం ఎస్వీకేకు మాత్రమే పరిమితం కావొద్దనీ, దాన్ని జిల్లా, మండల, క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. వచ్చే ఏడాది రాష్ట్రస్థాయి బాలోత్సవాన్ని ఎల్బీస్టేడియంలోనో, నిజాం కాలేజీ మైదానంలోనో నిర్వహించుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల్లో అద్భుతమైన సృజనాత్మకత దాగి ఉంటుందనీ, ఒక్కో రంగంలో ఒక్కొక్కరు చురుగ్గా ఉంటారని తెలిపారు. తల్లిదండ్రులు వారి శక్తిసామర్ధ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంతో పాటు ఎస్పీబాలసుబ్రమణ్యం జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. బాల్యస్మృతులను గుర్తుచేసుకున్నారు. కళలు, ఆటలు, చదువులు వేర్వేరు కాదని స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య బందీ అయిన తరగతిగది ముఖచిత్రం, విద్యావిధానం మారాలని ఆకాంక్షించారు. 'నే సంపాదించిన ఆస్తులన్నీ ఇచ్చేస్తా...నే సంపాదించిన కీర్తిసంపదలన్నింటినీ ఇచ్చేస్తా..నా బాల్యాన్ని తెచ్చివ్వగలరా' అంటూ పాటగట్టి చిన్నారులను ప్రోత్సహించారు. 'ఒకటే జననం..ఒకటే మరణం..గెలుపొందే వరకూ..' అంటూ తాను రచించిన పాటను ఆలపించి పిల్లలను చైతన్యపర్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహణ కమిటీ కార్యదర్శి ఎన్.సోమన్న, నిర్వాహకులు భూపతి వెంకటేశ్వర్లు, అనుముల ప్రభాకర్, శాంతారావు, మమత, సుజావతి, మారన్న తదితరులు పాల్గొన్నారు. పిల్లల ప్రదర్శనలకు 36 మంది న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 60 మంది వాలంటీర్లు తమ సేవలను అందించారు.
పిల్లలు స్వేచ్ఛా జీవులై
'మమ్ముల్ని నాలుగు గోడలకే పరిమితం చేయకండి.. మాకంటూ స్వేచ్ఛనివ్వండి.. ఆడనివ్వండి.. ఆలోచించ నివ్వండి.. తర్కించనివ్వండి.. మేమెంటో నిరూపించు కుంటాం' అంటూ చిన్నారులు తమలో దాగి ఉన్న శక్తి సామర్ధ్యాలను బాలోత్సవం వేదిక సాక్షిగా ప్రదర్శించారు. తమ అద్భుతమైన వాగ్దాటిని సైతం ప్రదర్శించారు. అందరూ అబ్బురపోయేలా శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. భగత్‌సింగ్, అల్లూరిసీతారామరాజు, గాంధీ, కర్ణుడు, ఫూలే, అంబేద్కర్ ఇలా విచిత్ర వేషధారణలతో వచ్చిన విద్యార్థులు ఏకపాత్రాభినయ పాత్రతో పంచ్ డైలాగ్‌లను విసురుతూ తామేంటో నిరూపించుకున్నారు. జానపద, అభ్యుదయం, సినీ, ఆధ్యాత్మిక పాటలను తమ గళాల ద్వారా వినిపించి అందరిచేతా చప్పట్లు కొట్టించారు. ఇంటర్నెట్ కాలంలో మనుషుల జీవిన విధానం ఎలా తయారైంది? అనే విషయాన్ని కండ్లకు కట్టినట్టు చూపారు. వర్షపు నీటిని నిల్వచేసుకుని ఇంటి అవసరాలకు, ఫిల్టర్ చేసి తాగేందుకు వాడుకునేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రకృతి సంపదను ఎలా వాడుకోవాలనే ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ఇలా ఒక్కటేంటి అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ప్రదర్శనా ఒక విజ్ఞాన దర్శినే. హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఏటేటా నీటి కాలుష్యం ఏవిధంగా పెరుగుతున్నది? మూసీ నదిలో కాలుష్య తీవ్రత ఎంత తీవ్రస్థాయికి చేరింది? పర్యావరణాన్ని ఏవిధంగా కాపాడుకోవాలి? తదితర అంశాలతో 'పర్యావరణ పరిరక్షణ' పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పిల్లలను ఆలోచింపజేసింది. బతుకమ్మ, జానపద కళారూపాల ప్రదర్శనలతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
పల్లె సుద్దుల పేరిట చిన్నారుల నోళ్ల నుంచి జాలువారిన మాటల ముత్యాలు ఆకట్టు కున్నాయి. భూ వివాదాలు, చిన్నచిన్న అంశాలకే కొట్టు కోవడాలు, తదితర అంశాలతో ప్రదర్శించిన లఘునాటికలు ఆలోచింపజేశాయి. స్వాతంత్య్ర సమరయోధులు, పలువురు ప్రముఖుల వేషధారణలతో మరికొందరు విచిత్ర వేషధారణలతో వచ్చి తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. హైస్కూల్ విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాలుపంచుకున్నారు. ఇవే కాదండోరు. ఆకాశం నుంచి తారలు ఊడిపడ్డట్టుగా ఎస్వీకే దగ్గర ఒకేదగ్గర వేలాది మంది విద్యార్థులు పోగై అటూ..ఇటూ పరుగెడుతూ... నవ్వుతూ..ముచ్చటిస్తూ సందడి చేశారు. క్లాసు రూమ్‌ల బట్టీ చదువులకు కాస్త విరామం దొరికిందన్న సంతోషంతో మరోప్రపంచంలో విహరించారు.