Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటిపారుదల శాఖల్లో పర్యవేక్షణ కరువు
- 'రియల్' ఆక్రమణలో పంటకాల్వలు
- బఫర్‌జోన్ వదలకుండా వెంచర్లు
- అధికారుల సంతకాలు సైతం ఫోర్జరీ!
- ఎన్వోసీల విషయంలో మాయాజాలం
- రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు శూన్యం
ఖమ్మం నగర పరిసరాల్లో విచ్చలవిడిగా వెంచర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోని ఖమ్మం రూరల్, అర్బన్, రఘునాథపాలెం, కూసుమంచి, చింతకాని, కొణిజర్ల తదితర మండ లాల్లో వేస్తున్న వెంచర్లలో కనీస ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. 2017 నుంచి నేటి వరకు వేసిన అనేక వెంచర్ల మాటున పంటకాల్వలు కనుమరుగయ్యాయి. నగర పరిసర భూములు ఎకరం రూ.కోట్లలో పలుకుతుండటంతో కొద్ది పాటి స్థలాన్ని కూడా వదిలేందుకు రియల్టర్లు సుముఖంగా లేరు. పంట కాల్వలకు ఇరువైపులా 9 మీటర్ల బఫర్ జోన్ వదిలివేస్తేనే నీటిపారుదల శాఖ నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ (ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధన సుడా పరిధిలో ఎక్కడా అమలు కావడం లేదు.
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రియల్టర్లు చేతులు తడుపుతుండటంతో నీటి పారుదలశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డీటీసీపీ లేఅవుట్ పేరేకానీ ఏ ఒక్కచోటా నిబంధనలకు అనుగుణంగా వెంచర్లు లేవు.
నకిలీ సంతకాలతో ఎన్వోసీలు..
ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడు, ఏదులాపురం, పెద్దతండా, ముత్తగూడెం తదితర రెవెన్యూల్లో కొందరు వెంచర్ల నిర్వాహకులు ఏకంగా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి మరీ ఎన్వోసీలు సృష్టిస్తున్నా ఇటు సుడా.. అటు ఇరిగేషన్ అధికారులు మనదేమి పోతుందన్నట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోప ణలున్నాయి. కొన్నిచోట్ల పంటకాల్వల్లో గ్రానైట్ వ్యర్థాలు పోయడం.. వెంచర్లలో వదలాల్సిన గ్రీన్‌బెల్ట్‌ను బఫర్‌జోన్‌లో కేటాయించడం.. పంటకాల్వలను పూడ్చడం.. కుచించివేయడం.. వెంచర్లకు అడ్డువస్తే కాల్వల దిశ మార్చడం.. అవసరమైతే నిరుపయోగం అనే పేరుతో ఏకంగా పూడ్చివేసి ఆక్రమించడం.. ఇవన్నీ షరామామూలే అయినా నీటిపారుదల శాఖ, సుడా అధికారులు కాసుల కక్కుర్తితో చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు హడావుడి చేయడం.. బఫర్‌జోన్ నిర్దేశించి మార్కింగ్ చేయడం.. ఆ తర్వాత వదిలివేయడం ఆనవాయితీగా మారింది. ఇదే అదనుగా భావించి ఏదులాపురం రెవెన్యూలోని శ్రీరామ్‌నగర్‌లో ఓ వెంచర్ నిర్వాహకుడు, హెచ్ఎల్సీ (హౌస్ లోన్ కన్సల్టెంట్) తోడై ఏకంగా నీటిపారు దలశాఖ డీఈ, పంచాయతీ సెక్రటరీల సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్వోసీ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేయడంతో పాటు బఫర్‌జోన్ లేకుండా ఏకంగా కాల్వలో నుంచే ప్రహరీగోడ నిర్మాణం చేపట్టడం విస్మయం గోల్పుతోంది. గుర్రాలపాడు రెవెన్యూలో ఇదే రియల్టర్లు వేసిన మరో వెంచర్ ఎన్వోసీకి విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఇక్కడ పంటకాల్వ దిశ మార్చడంతో పాటు నక్షాకు విరుద్ధంగా రోడ్లు, కల్వర్టుల నిర్మాణం జరిగినట్టు ఇటీవల రెవెన్యూ సర్వేలో బయట పడింది. అయినా సంబంధిత రియల్ట ర్లపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం విమర్శ లకు తావిస్తోంది. తాజాగా ఇదే రియల్టర్లు ఆటో నగర్లో వేస్తున్న మరో వెంచర్ పైనా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి.
కాల్వల దురాక్రమణలు..
లేఅవుట్ నిబంధనల ప్రకారం ఎటువంటి వెంచర్ వేసినా గ్రీన్‌బెల్ట్ వదలాల్సి ఉంటుంది. రూ.కోట్ల విలువైన భూముల్లో వెంచర్ వేస్తుండటంతో రియల్టర్లకు గ్రీన్‌బెల్ట్ వదలడం ఏమాత్రం రుచించడం లేదు. పక్కనున్న పంటకాల్వల్లో కొంతభాగమో.. కాల్వ నిరుపయోగంగా ఉంటే మొత్తానికే ఆక్రమించి దాన్ని గ్రీన్‌బెల్ట్ కింద చూపుతున్న ఉదంతాలు సైతం సుడా పరిధిలో వెలుగుచూస్తున్నాయి. ఏదులాపురం రెవె న్యూలో పీవీఆర్ గార్డెన్ సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఓ కాల్వను ఇలాగే ఆక్రమించేశారు. నీటిపారు దలశాఖ అధికారులు హెచ్చరించినా ఇక్కడ వృథా ప్రయాసే అవుతోంది. లక్ష్మీ బృందావనం వద్ద ఇదే పరిస్థితి. గుర్రాలపాడు రెవెన్యూలో 26-18 సర్వేనంబర్ల మధ్య పంటకాల్వను గ్రానైట్ వ్యర్థాలతో నింపుతున్నారు. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన కాల్వ కొన్నిచోట్ల మూడు, నాలుగు అడుగులకు కుచించుకుపోయినా నీటిపారుదల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. దానికి సమీపంలోని ఓ వెంచర్లో బఫర్‌జోన్‌ను ఆక్రమించి గ్రీన్‌బెల్ట్‌గా చూపించినా సంబంధిత అధికారులకు పట్టడం లేదు. ఇలాంటి ఉదంతాలు ఖమ్మం నగర పరిసరాల్లో కోకొల్లలుగా ఉన్నా.. వెంచర్లలో బ్యాంక్లోన్లతో నిర్మాణాలు పూర్తయ్యేంత వరకూ అధికారులు చోద్యం చూస్తున్నారు. హెచ్ఎల్సీలు, వెంచర్ల యజమానుల ప్రలోభాలకు తలొగ్గి తీరా ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాక వచ్చి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పైపెచ్చు రాజకీయ ఒత్తిళ్లనే సాకులు చూపుతుండటం గమనార్హం.
టాస్క్‌ఫోర్స్ టీంలతోనే ఆక్రమణలకు అడ్డుకట్ట
నీటిపారుదల, రెవెన్యూ, పోలీసులు, సుడా అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ టీంలు ఏర్పాటు చేస్తేనే పంటకాల్వల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయొచ్చని ఓ నీటిపారుదలశాఖ అధికారి తెలిపారు. ఆక్రమణ దారులపై తమ శాఖ పరంగా జీవో 105 ఆధారంగా చర్యలు తీసుకున్నా ఏమాత్రం స్పందించడం లేదని వాపోతున్నారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తున్నా వారు సైతం తమకు సహకరించే పరిస్థితి లేదని, పైపెచ్చు రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటు న్నాయని తెలిపారు. తమ సంతకాలు ఫోర్జరీ చేయడం, ఎన్వోసీ లకు విరుద్ధంగా వెంచర్లు వేస్తున్న విషయాన్ని పై అధి కారుల దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఇప్పటికే వీటిపై దృష్టిసారించామని, న్యాయపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవు..
పంటకాల్వలు ఆక్రమించి, ఎన్వోసీకి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా వాటిని కూలగొడతాం. ఏడాది కాలంగా ఎన్వోసీల బాధ్యత పూర్తిగా నేనే తీసుకున్నాను. అంతకుముందు డీఈలు, ఈఈలు, ఎస్ఈలు ఇలా ఎవరి సంతకాలు ఫోర్జరీ చేసినట్టు నా దృష్టికి తీసుకొస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కాల్వలు, బఫర్జోన్లు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే నిర్దాషిణ్యంగా కూల్చివేస్తాం. సంబంధిత యజమానిపై చర్యలు తీసుకుంటాం.
- శంకర్‌నాయక్, చీఫ్ ఇంజినీర్, ఖమ్మం జిల్లా.