Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిత్ర సీమకు తీరని లోటు : తమ్మినేని
- ఆమెది ప్రజా నాట్య మండలి కుటుంబం : నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు సినీ సత్యభామ, మహానటి జమున మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించిన జమున... తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని సీఎం పేర్కొన్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, హిందీ భాషా చిత్రాల్లో కూడా నటించిన ఆమె.. ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారని వివరించారు.
నటిగా కళా రంగానికి సేవ చేయటమేగాక పార్లమెంటు సభ్యురాలిగా కూడా ప్రజలకు సేవ చేయటం గొప్ప విషయమని నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ ఎమ్డీ అరవింద్ కుమార్ తదితరులు ఆమె మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.
జమున మరణం పట్ల సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. వామపక్ష భావజాలం కలిగిన ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు ద్వారా జమున కళారంగంలోకి అడుగుపెట్టారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ఆమె... మంచి పాత్రల ద్వారా ప్రజలకు చేరువయ్యారని పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యురాలిగా కూడా సేవలందించిన జమున మరణం చిత్ర పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని తమ్మినేని ఈ సందర్భంగా తెలిపారు. ఆమె మరణం కళా రంగానికి తీరని లోటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆమెది ప్రజా నాట్య మండలి కుటుంబమని తెలిపారు. తాను సీపీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు పీఎన్ఎమ్కు కార్యక్రమానికి రావాలంటూ కోరితే మఖ్దూం భవన్‌కు వచ్చారని గుర్తు చేశారు. జమున కుటుంబ సభ్యులకు నారాయణ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కూడా జమున మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ సాహితి, పీఎన్ఎమ్ సంతాపం...
జమున మరణం పట్ల తెలంగాణ సాహితీ, ప్రజా నాట్య మండలి తీవ్ర సంతాపాన్ని తెలిపాయి. ఆమె కుటుంబ సభ్యులకు తెలంగాణ సాహితీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్థన, కె.ఆనందాచారి, రాష్ట్ర నాయకులు రాంపల్లి రమేశ్, ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి కట్టా నర్సింహా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు సహచర్యంలో, ప్రజా నాట్య మండలిలో పని చేసిన జమున... ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారని ఆనందాచారి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రముఖ నటిగా, మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న ఆమె మరణం చిత్ర రంగానికి తీరని లోటని తెలిపారు. సినిమా హీరోలతో సమఉజ్జీగా అద్భుత నటనను ప్రదర్శించిన జమున తెలుగు కళారంగంలో చిరస్మరణీయురాలని నివాళులర్పించారు. పీఎన్ఎమ్ జాతీయ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి కూడా జమున మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.