Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూ పోరాటం
- ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు..
- వెలుస్తున్న వందలాది గుడిసెలు
- ఇండ్ల స్థలాలు సాధించడమే లక్ష్యంగా అడుగులు
- కేసుల నమోదవుతున్నా భయపడని వైనం..
నవతెలంగాణ-భూపాలపల్లి
గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతిని, ఉపాధి కరువై.. చేతిలో పనిలేక పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు నిత్యం పేదలు వలసలు వస్తూనే ఉన్నారు. వీరంతా నిలువ నీడ లేక దుర్బర జీవితాలు గడుపుతున్నారు. ఎక్కువగా కనీస సౌకర్యాలు లేని ఇరుకైన గదుల్లో కొందరు అద్దెకు ఉంటుండగా, మరికొందరు డ్రైనేజీల వెంట, అట్టముక్కులు, చీకిపోయిన చీరెలు, ఇరిగిపోయిన రేకులతో చిన్నచిన్న గుడిసెలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో గూడు కోసం పేదలు పోరుబాట పడుతున్న నేపథ్యంలో వారికి సీపీఐ(ఎం) అండగా నిలుస్తుంది. మేమున్నామంటూ వారి ఇండ్ల జాగా కోసం పోరాడుతోంది. గతంలోనూ సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించి అనేక కాలనీలు ఏర్పడగా అందులో వేలాది సంఖ్యలో పేదలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. తాజాగా మళ్లీ జిల్లాలో సీపీఐ(ఎం) నేతృత్వంలో మూడు రోజులుగా భూ పోరాటాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు సర్వే నెంబర్ 280, 283, 284, 285లో సుమారు 24 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాల నీడన గడిసెలు వెలుస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు, పోలీసుల నుంచి కేసులు, బెదిరింపులు, వేధింపులు వస్తున్నప్పటికీ పిడికిలెత్తి పోరాటాన్ని మున్ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలోనూ ప్రభుత్వాలతో కొట్లాడి.. కమ్యూనిస్టు పార్టీ పేదలకు ఇండ్ల జాగాలను సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, పట్టణంలో న్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న భూములనూ పేదలకు పంచాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా భూపాలపల్లిలో జరుగుతున్న భూపోరాటాలు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పేదలకు పట్టాలు అందే వరకు పోరాటాలు సాగిస్తాం : బందు సాయిలు, సీపీ(ఎం) జిల్లా కార్యదర్శి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పదేండ్లుగా సుమారు 30 కేంద్రాల్లో భూ పోరాటాలు నిర్వహించాం. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా మండుటెండలో పోరుయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేశాం. ప్రధానంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో సుమారు 1500 మంది, జవహర్ నగర్ కాలనీలో 1200 మంది నిరుపేదలకు గూడు కల్పించాం. అనంతరం పట్టాలు అందే వరకు పోరాటాలు నిర్వహించాం. శాంతినగర్ 250 మంది, రాజీవ్ నగర్ 300, ఇందిరానగర్ 300 మందికి పట్టాల కోసం నిరంతర పోరాటాలు జరుగుతున్నాయి. దినదినం అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి పట్టణంలో పేదలకు ఇండ్లు కొనుగోలు చేసే శక్తి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడుతున్న కొంత మంది అధికార, ధనబలం కలిగిన వారిని ప్రభుత్వం ప్రశ్నించడం లేదు. ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నా పేదలకు కనీసం నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేకుండా పోతున్నది. అందుకే ప్రభుత్వ భూములు పేదల పరం చేసేందుకు పోరాటాలు సాగిస్తున్నాం. ఫిబ్రవరి 3వ తేదీన మున్సిపాలిటీలో దరఖాస్తులు ఇవ్వడంతో పాటు 9వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి గుడిసె వాసులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం..
బతకడం కష్టతరంగా మారింది : మల్లాడి సరిత, హనుమాన్ నగర్, భూపాలపల్లి
నా భర్త శ్రీనివాస్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సంపాదన రూ.11,000 మాత్రమే. ఇద్దరు అబ్బాయిలు. 20ఏండ్లుగా హనుమాన్ నగర్లో కిరాయి ఇంట్లో ఉంటూ నెలకు రూ.4000 అద్దె చెల్లిస్తున్నాము. చాలీచాలని వేతనంతో కిరాయితోపాటు ఇల్లు గడవడం కష్టంగా మారింది. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గుడిసె వేసుకున్నాం. ప్రభుత్వ అధికారులు స్పందించి ఇంటి స్థలం కేటాయించాలి.
ఇంటి స్థలం కేటాయించి ఆదుకోవాలి : కసుబోసుల అభిలాష్, కారల్ మార్క్స్ కాలనీ, భూపాలపల్లి
18 సంవత్సరాలుగా కిరాయికి ఉంటూ జీవనం సాగిస్తున్నాం. కార్పెంటర్‌గా కూలి చేస్తూ నెలకు రూ.12,000 సంపాదిస్తున్నప్పటికీ ఇందులో రూ.3500 అద్దె చెల్లిస్తున్నాను. భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం కష్టతరంగా మారింది. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గుడిసె వేసుకున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఇంటి స్థలం కేటాయించాలి.