Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎంబీబీఎస్, పీజీ మెడికల్ ఫీజులకు సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ మమత ఎడ్యూకేషనల్ సొసైటీ చైర్మెన్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది.
విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దని, ఒకవేళ చేస్తే తిరిగి అధిక ఫీజు మొత్తాన్ని చెల్లించాలన్న ఉత్తర్వులకు విరుద్ధంగా తన నుంచి రూ.60 లక్షలకుపైగా వసూలు చేశారంటూ డాక్టర్ జి.నిఖిల్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ను శుక్రవారం న్యాయస్థానం విచారించింది. ఇదే తరహా కోర్టు ధిక్కార కేసులతో కలిపి దీన్ని కూడా ఏప్రిల్ 17న విచారిస్తామని తెలిపింది.
దర్యాప్తు పురోగతిపై రిపోర్టు ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 25 ఎకరాల భూమిలో పది టవర్లతో 32 అంతస్తులతో గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లను నిర్మిస్తామంటూ చెప్పి జనాన్ని మోసం చేసిన సాహితి శర్వాణి ఎలైట్కు సంబంధించి వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించాలని పోలీసులకు హైకోర్టు నోటీసులిచ్చింది. బాధితుల ఫిర్యాదులపై మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను, ఆ కంపెనీ మాజీ డైరెక్టర్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీల డివిజన్ బెంచ్ విచారించింది. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది.