Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9,700 మందికిపైగా పదోన్నతులు
- నేటినుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సుమారు 40 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశమున్నది. ఒకే పాఠశాలలో ఎనిమిదేండ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ఐదేండ్లు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) తప్పనిసరిగా బదిలీ అవుతారు. రాష్ట్రంలో వారు సుమారు 25 వేల మంది వరకు ఉంటారని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బదిలీకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం రెండేండ్ల సర్వీసు ఉండాలన్న నిబంధన ఉన్నది. దీంతో 15 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 317 జీవో అమలు నేపథ్యంలో 22,418 మంది ఉపాధ్యాయులు గతేడాది బదిలీ అయ్యారు. వారికి ప్రస్తుత బదిలీల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. జీరో సర్వీసుతో బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుత బదిలీల ప్రక్రియలో మొత్తంగా 40 వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలగనుంది. అయితే 9,700 మందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశమున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈనెల 30 వరకు గడువున్నది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతుల ప్రక్రియను చేపడతారు.