Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహ
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగులో కూడా న్యాయ విద్యను బోధించాలనీ, ఆ మేరకు విద్యార్థులకు ఆప్షన్ ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ.ఎస్.నరసింహ చెప్పారు. తెలుగులో లా విద్యాబోధన కాలేజీలు ఏర్పాటు అవసరం లేదనీ, అయితే తెలుగును ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఉండాలన్నారు. కొన్ని కాలేజీల్లోనైనా ఆ విధమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా కోర్టుల్లోనైనా తెలుగు భాషలో వాదనలు, తీర్పులు వెలువడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పుడే తమ కేసుల్లో ఏం జరిగిందో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. కింది కోర్టుల్లో కేసుల వాదనలు, తీర్పులు తెలుగులో ఉండాలని కోరారు. బ్రిటీష్ కాలం నాటి విధానంలో ఇంగ్లిషులో వాదనలు సాగుతుండటంతో చాలా మందికి తమ కేసు గురించి ఏం జరుగుతోందో తెలియడం లేదని చెప్పారు. బార్ అండ్ బెంచ్ సంబంధాలపై హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఇప్పటికీ ఆనాటి విధానాలే కొనసాగడం సరికాదంటూ, మన భాషలకు అనుగుణంగా మార్పులు రావాల్సి ఉందన్నారు. ట్రయిల్ బేసెస్పై కొన్ని కాలేజీల్లో తెలుగులో కూడా లా క్లాస్‌లను నిర్వహించాలని కోరారు. దీని వల్ల జిల్లా కోర్టులో తీర్పులు తెలుగులో వస్తాయనీ, అప్పుడు జనానికి కోర్టుల్లో ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. సాధన ఉంటేనే వృత్తిలో గుర్తింపు, ఫలితంగా గౌరవం లభిస్తాయని చెప్పారు. పెండింగ్ కేసుల గురించి ఆయన మాట్లాడుతూ, అన్నదమ్ముల భూ పంచాయితీకి.. భార్యాభర్తల విడాకులకు.. దాదాపు 15 నుంచి 25 ఏండ్లు పడుతుంటే వారికి లభించే న్యాయం ఏ కోవకు చెందుతుందో ఆలోచన చేయాలన్నారు. కోర్టులంటే భయపడేలా ఉండకూడదని హితవు పలికారు. ఇలాంటి కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు.
ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లా నుంచి ఎమ్మార్వో పైన్నో, ఇంకో అధికారిపైన్నో చిన్న కేసు కోసం హైకోర్టుకు వచ్చేలా కాకుండా అక్కడి జిల్లా కోర్టులోనే కేసు విచారించేలా మార్పులు చేయాల్సి ఉందని తెలిపారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు సాంకేతికను అందిపుచ్చుకోవడంతో పాటు న్యాయ వ్యవస్థలోనూ దాన్ని అమలు చేస్తే ఫలితాలు బాగుంటాయని చెప్పారు. హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మెన్ రఘునాథ్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌భూయాన్, ఏజీ బీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.