Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీరో సర్వీసుకు అనుమతివ్వాలంటూ నేడు నిరసనలు : యూఎస్పీసీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పైరవీ బదిలీలను ఆపాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీరో సర్వీసు బదిలీలకు అనుమతి ఇవ్వాలంటూ శనివారం జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తూ, రాజకీయ పలుకుబడితో చేస్తున్న వందలాది పైరవీ బదిలీలను నిలిపేయాలని కోరింది. సాధారణ బదిలీల్లో కనీస సర్వీసు నిబంధనను తొలగించాలంటూ విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదని తెలిపింది. ఏ విధమైన అక్రమాలకు తావు లేకుండా బదిలీలు పారదర్శకంగా జరపాలని ఉపాధ్యాయ సంఘాల సమా వేశంలో సూచించిన ప్రభుత్వమే పైరవీ బదిలీలకు తెరలేపడం ఉపాధ్యాయుల్లో అశాంతికి కారణమౌతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చిన ప్రకారం పైరవీ బదిలీలను నిలిపేయాలని డిమాండ్ చేసింది. ఉపాధ్యాయులందరికీ బదిలీల్లో పాల్గొనే అవకాశమిచ్చి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని కోరింది.
అక్రమ బదిలీలను రద్దు చేయాలి : తపస్
ఉపాధ్యాయ బదిలీల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేష్ తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను శుక్రవారం వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. జీరో సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు కూడా బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. నాలుగో కేటగిరీ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వాలని తెలిపారు. స్పౌజ్ కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్ఎం, ఎస్ఏ, ఎస్జీటీలందరికీ బదిలీలు చేపట్టాలని సూచించారు. పండితులు, పీఈటీల సమస్యపై ఉన్న కోర్టు స్టేను తొలగించి అడ్‌హక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించాలని కోరారు. అక్రమ బదిలీలను రద్దు చేసి పదోన్నతులు పొందిన వారికి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం : టీఎస్పీటీఏ
స్పౌజ్ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ద్వితీయ శ్రేణి భాషా పండితుల విషయంలో స్పష్టత లేదని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య తెలిపారు. శుక్రవారం విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని కలిసి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలంటూ కోరామన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ దానిని కూడా పరిష్కరిస్తామని గతంలో ఇచ్చిన హామీనే పునరుద్ఘాటించారు. కానీ ఎప్పుడు చేస్తారో స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. అధికారులు, విద్యామంత్రి ఇచ్చిన హామీపై శనివారం సాయంత్రంలోగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆదివారం పెద్ద ఎత్తున పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.