Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయశాంతి 25 ఏండ్ల రాజకీయ ప్రస్థాన కార్యక్రమంలో బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సినిమా రంగం నుంచి వచ్చి 25 ఏండ్లుగా రాజకీయాల్లో కొనసాగడం మామూలు విషయం కాదనీ, తెలంగాణ ఉద్యమకారిణి అయిన విజయశాంతి తన చివరి మజిలీ వరకూ బీజేపీలోనే కొనసాగాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆకాంక్షించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తమిళనాడు సహాయ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్‌రెడ్డి, జి.వివేక్, మాజీమంత్రి బాబూమోహన్, మాజీ ఎంపీలు చాడా సురేష్ రెడ్డి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ చిన్నచిన్న కారణాలతో పార్టీని వీడినవారంతా తిరిగి రావాలని కోరారు. తాను తప్పుచేసినా ప్రశ్నించే హక్కు కార్యకర్తలకు ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి పాత్రను గుర్తు చేశారు. విజయశాంతి మాట్లాడుతూ..తనకు పదవులపై ఆశలేదనీ, తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఒక రాక్షసుడు ఎదురై నమ్మించి మోసం చేశాడని విమర్శించారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ రాకూడదనే కేసీఆర్ సహా చాలా మంది ఎంపీలు భావించారన్నారు. 2024లోనూ మోడీయే ప్రధాని అవుతారనీ, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.