Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణకు నిధులు కేటాయించాలి
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనాలు చెల్లించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ శాఖల్లో వివిధ రకాల పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు తక్కువ జీతాలను చెల్లిస్తున్నారని తెలిపారు. వారికి 2020 పేస్కేళ్లలోని కనీస మూలవేతనం చెల్లించేందుకు వీలుగా 2023-24 బడ్జెట్లో ప్రతిపాదించాలని కోరారు. కేజీబీవీల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు, కొన్నింటిలో ఇంటర్ తరగతులనూ నిర్వహిస్తున్నారని వివరించారు. సర్కారు బడుల్లోని స్కూల్ అసిస్టెంట్ వేతనం రూ.42,300 నుంచి రూ.1.15 లక్షల వరకు ఉందని తెలిపారు. కానీ కేజీబీవీ టీచర్లకు రూ.26 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టు కనీస మూలవేతనం రూ.42,300 చెల్లించాల్సి ఉందని వివరించారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఇంటి అద్దె భత్యం, కరువు భత్యం అదనంగా ఉంటాయని తెలిపారు. ఆరు నుంచి పదో తరగతికి బోధన చేసే టీచర్‌ను రెగ్యులర్‌గా నియమిస్తే ప్రభుత్వం రూ.53,742 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ కేజీబీవీలో పనిచేస్తున్న వారికి రూ.26 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నదని వివరించారు. వారికి కనీస మూలవేతనం రూ.42,300 చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచిన సందర్భంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకిచ్చే వేతనాన్ని పెంచేలా బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని కోరారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నిర్వహణ మెరుగుదలకు 2022-23 బడ్జెట్ కంటే 50 శాతం అదనంగా వచ్చే బడ్జెట్లో ప్రతిపాదించాలని సూచించారు. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పారిశుధ్యం, ఇతర సర్వీసు పనులను, గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లు చేయలేకపోతున్నాయని వివరించారు.
వచ్చే బడ్జెట్లో వాటి నిర్వహణలో భాగంగా సర్వీసు పర్సన్ల నియామకం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూళ్లను నిర్మించి పదేండ్లయ్యిందనీ, వాటి భవనాల రంగు వెలసిపోయాయని తెలిపారు. ఆయా భవనాలకు రంగులు వేసేందుకు, మరమ్మతుల కోసం అదనపు బడ్జెట్ కేటాయించాలని పేర్కొన్నారు.