Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అభ్యర్థి వినయ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాస్త్రీయతతో కూడిన ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ ఎ వినయ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 317 జీవోను బలవంతంగా ఉపాధ్యాయులపై రుద్ది వేల మందిని స్థానికేతరులుగా చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం మారుమూల ప్రాంతాలకు కేటాయించి ఉపాధ్యాయులను బదిలీ చేసి ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఎన్ని రకాలుగా ప్రాతినిధ్యం చేసినా, బాధితులు ముట్టడించినా ప్రభుత్వం దిగి రాలేదని తెలిపారు. జీరో సర్వీస్‌తో బదిలీలు చేయాలంటూ టీపీటీఎఫ్, బీటీఎఫ్, యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఉద్యమించినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కుట్రపూరితంగా పరపతికలిగిన వారికి దొడ్డిదారిలో ఇబ్బడిముబ్బడిగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనే వందల బదిలీలు ప్రభుత్వం చేపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది అన్యాయమనీ, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అక్రమ బదిలీలను రద్దు చేయాలనీ, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో బాధితులు, స్పౌజ్ టీచర్లందరికీ న్యాయం చేయాలని కోరారు.