Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టంలో భాగంగా మంజూరైన సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను మార్చి 25లోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యేలా చూడాలని ఉన్నతాధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని మంజూరైన పనులకు పాలనా, సాంకేతిక పరమైన మంజూరీలు పూర్తిచేసి సత్వరమే పనుల గ్రౌండింగ్ పూర్తిచేయాలని ఆదేశించారు. పనులన్నీ పూర్తిచేసి చెల్లింపుల కోసం ఎఫ్టిఓ జనరేట్ చేయాలని సూచించారు. తద్వారా మెటీరియల్ బడ్జెట్ నిధులు ఫిబ్రవరిలో వస్తాయని చెప్పారు. పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కొన్నిచోట్ల సెలవుల్లో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగరాదని డీఈలను సమన్వయం చేసుకుని పనులు పూర్తిచేయించాలని సూచించారు. అవసరం మేరకు ఎప్పటికప్పుడు పనుల ప్రగతిపై సమీక్షలు జరపాలని ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ సంజీవరావును కోరారు. పనుల గ్రౌండింగ్ విషయంలో క్షేత్రస్థాయిలో సమస్యలుంటే వాటిని నమోదు చేసుకోవాలని కమిషనర్ హనుమంతరావుకు సూచించారు. అందుబాటులో ఉన్న నిధులు సద్వినియోగపరచుకోలేని చోటనే గ్రామపంచాయతీ భవనాలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితిలోనూ మార్చి 25 లోగా పనులన్నీ పూర్తి చేసి నెలాఖరులోగా అప్ లోడ్ పూర్తి చేయాలన్నారు.