Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్ పార్సిల్ సర్వీస్ ప్రారంభం
- వినియోగదారులకు మరింత చేరువవుతాం-ఎమ్డీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్‌లో భాగంగా 'ఏఎమ్ టూ పీఎమ్' ఎక్స్‌ప్రెస్ పార్సిల్ సర్వీస్‌ను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రారంభించారు. ఎంపిక చేయబడిన 99 కేంద్రాలకు ఒక కేజీ పార్సిల్ (రూ.5వేల వరకు విలువైనవి)ను కేవలం రూ.99 కే ఉదయం బుక్ చేస్తే, సాయంత్రానికి డెలివరీ చేసే సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల లోపు (ఏఎమ్) పార్సిల్‌ను బుక్ చేస్తే, అదే రోజు రాత్రి 9 గంటలకల్లా డెలివరీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత (పీఎమ్) పార్సిల్ బుక్ చేస్తే మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా డెలివరీ చేస్తారు. దీనికే 'ఏమ్ టూ పీఎమ్' అని పేరుపెట్టారు. ఈ సర్వీసులకు నగదు, యూపీఐ పేమెంట్స్ చెల్లుబాటు అవుతాయి. మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్ 9154680020లో సంప్రదించవచ్చు. అలాగే టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం అధికారిక వెబ్సైట్ www.tsrtcparcel.in లో సంప్రదించవచ్చని ఎమ్డీ సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా బస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన లాజిస్టిక్ సర్వీసుల గురించి వివరించారు. ప్రస్తుతం ఈ-కామర్స్ యుగం నడుస్తున్నదనీ, దానికి తగినట్టే ఆర్టీసీ సేవల్ని విస్తరిస్తున్నామన్నారు. టైర్-3 సిటీలకు ఆర్టీసీ లాజిస్టిక్ సేవల్ని మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 'ఏఎమ్ టూ పీఎమ్' సర్వీసులు చిన్న వ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎంపిక చేసిన రూట్లలోనే ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉంటాయని వివరించారు. టిక్కెట్ ఆదాయానికి అదనంగా పెట్రోల్ బంకుల నిర్వహణ, లాజిస్టిక్స్, జీవా వాటర్ బాటిళ్ల మార్కెట్లోకి ప్రవేశించామని చెప్పారు. 2020 జూన్‌లో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవల్ని ప్రారంభించామనీ, రోజుకు 14వేల పార్సిళ్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 37.31 లక్షల పార్సిళ్లు బట్వాడా చేశామన్నారు. సమీప రాష్ట్రాల్లోని 88 ప్రాంతాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 364 మంది ఏజెంట్ల ద్వారా 192 ప్రత్యేక వాహనాలతో కార్గో సర్వీసులు నిర్వహిస్తున్నామన్నారు. రవాణారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయనీ, దానికి అనుగుణంగా అవసరాలను బట్టి బస్సు డిజైన్లలో మార్పులూ అవసరమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవల్ని వినియోగించుకుంటున్నాయనీ, ప్రయివేటు నుంచి కూడా ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నదని వివరించారు. టీఎస్ఆర్టీసీ సేవలపై ప్రజలు, ప్రయాణీకులు, వినియోగదారులు సంస్థకు తప్పనిసరిగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనీ, దీనివల్ల సేవల్ని మరింత విస్త్రుత పరచడంతో పాటు, మెరుగైన నిర్వహణ సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగాధిపతి సంతోష్‌కుమార్, హన్సా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు త్రినాధ్‌బాబు, శ్రవణ్‌కుమార్, చీఫ్ మేనేజర్ (ఫైనాన్స్) పుష్పకుమారి, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.