Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో పరిశోధన, అభివృద్ధి రంగాలకు ప్రభుత్వాలు నిధులు పెంచాల్సిన అవసర మున్నదని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. 'త్రిబుల్ ఐటీ హైదరాబాద్' ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధన, అభివృద్ధి రంగాలకు ప్రభుత్వాలు ఇప్పటికీ నిధులు తక్కువగా వెచ్చిస్తున్నాయని తెలిపారు. సాంకేతికంగా భారతదేశం తనదైన ముద్ర వేసుకున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు రాకపోవడానికి ఇన్నోవేషన్ లేకపోవడమే కారణమన్నారు. ఇన్నోవేషన్ ఇకో సిస్టమ్లో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు. దేశ భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్నప్పుడే విజయం సాధించ గలుగుతారని తెలిపారు. ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న పేద దేశమంటూ, అత్యంత కీలకమైన వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతికత ఆధారిత పరిష్కారాలను చూపించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులు తమ పరిశోధనలు, ఆలోచనలను మరింత పదును పెట్టాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. పరిశోధన-అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా తమ పాఠ్య ప్రణాళికలను, విద్యా బోధన పద్ధతులను మార్చుకుంటే మరిన్ని మెరుగైన ఫలితాలు ఈ రంగంలో వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుతమున్న 50 బిలియన్ డాలర్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2028 నాటికి 100 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, సభ్యులు జయేష్ రంజన్, అజిత్ రంగనేకర్, శ్రీని రాజు, చంద్రశేఖర్, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, సస్టైనబిలిటీ, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లో పలు స్టార్ట్ అప్స్ రూపొందించిన ప్రయోగాలను ఉత్పత్తులను పరిశీలించారు.