Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్ -15 డొమెస్టిక్ జట్టుకు గుగులోతు కావ్యశ్రీ ఎంపిక
నవతెలంగాణ-బోడుప్పల్
జాతీయ స్థాయి మహిళా క్రికెట్ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి ఎంపికైంది. మేడ్చల్ జిల్లా పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ సాయి ఐశ్వర్యా కాలనీలో నివాసం ఉండే గగులోతు కావ్య శ్రీకి అవకాశం దక్కింది. మూడో డివిజన్ కార్పొరేటర్ బైటింటి శారదాఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కావ్య శ్రీని శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా కావ్య శ్రీ మాట్లాడుతూ.. 'జాతీయ జట్టులో అవకాశం రావాలనేది క్రీడాకారుల కల. అలాంటి అవకాశం నాకు దక్కడం చాలా సంతోషం. సామాన్య జీవితం గడుపుతూ క్యాటరింగ్ పనిచేసే తల్లిదండ్రులు పట్టుదలతో నాకు శిక్షణ ఇప్పించి నా ప్రతి అడుగులో తోడుగా నిలిచారు. 2017లో అశ్విన్ అకాడమీలో శిక్షణ పొందడం ప్రారంభించా. ఎంఎస్డీ అకాడమీలో కోచ్ మహేష్, సహా కోచ్లు సతీష్, దుర్గాల సహకారంతో ఈ స్థాయికి చేరా. 2022-2023 డొమెస్టిక్ అండర్15 క్రికెట్ టీంలో బీసీసీఐ ప్రకటించిన తుది జట్టులో అవకాశం రావాడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో జాతీయ మహిళా క్రికెట్ జట్టులో స్థానం పొందేలా కష్టపడి ఆడుతా' అని తెలిపారు. పీర్జాదీగూడ 3వ డివిజన్ కార్పొరేటర్ బైటింటి ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయి మహిళా క్రికెట్ టీంలో తమ డివిజన్ అమ్మాయికి స్థానం లభించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కావ్య శ్రీ తల్లిదండ్రులు శ్రీనివాస్, సుజాత, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.