Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీడీఎస్‌కు బడ్జెట్ పెంచాలి
- రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ధర్నా
- గ్రాట్యుటీ, పెన్షన్ అమలు చేయాలని డిమాండ్
- మార్చిలో మూడ్రోజులు సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
ఐసీడీఎస్‌ను రక్షించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ టీచర్స్, ఆయాలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేసి, వేతనంలో సగం వేతనాన్ని పెన్షన్‌గా నిర్ణయించాలని కోరారు. తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ (టీచర్స్) అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌కు బడ్జెట్ పెంచాలని, నూతన జాతీయ విద్యావిధానం చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. 2018లో కేంద్రం పెంచాలని వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం ఏరియర్స్‌తో కలిపి వెంటనే చెల్లించాలన్నారు. హెల్త్‌కార్డులు, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలని, బకాయి ఇంక్రిమెంట్, ఇన్చార్జి అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని.. పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ సౌకర్యాలు కల్పిస్తున్నారని, తమకూ అవి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు రూ.5లక్షలు, హెల్పర్లకు రూ.3లక్షలు ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించని ఎడల మార్చి 1,2,3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేటలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పద్మ మాట్లాడారు. రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరులోని ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు. భువనగిరిలోని సీడీపీఓ ఆఫీసు ఎదుట అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీడీపీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. నార్నూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సుభద్ర ఆధ్యర్యంలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా, అనంతరం సీడీపీఓకు వినతిపత్రం అందజేశారు. వనపర్తి ఐడీసీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పుట్ట ఆంజనేయులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా సీడీపీఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి అంగన్వాడీ పీడీ జరినా బేగంకు వినతిపత్రం అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ శిశుసంక్షేమ అధికారి కార్యాలయం ముందు ధర్నా, సీడీపీఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. కల్వకుర్తి పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా ధర్మాపురి పట్టణంలోని సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మూడుగం రాజలింగం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. వీరిలో బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అర్బన్ సీడీపీఓ ఆఫీస్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా అనంతరం సీడీపీఓకి మెమోరాండం అందజేశారు.