Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నెల 3న అధికారులకు వినతిపత్రాలు
- సొంత జాగా ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి
- రాష్ట్ర బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించాలి : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలను కేటాయిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెల తొమ్మిదో తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ లోని గోల్కొండ చౌరస్తాలో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ వేలాది మంది పేదలు ఇండ్ల స్థలాల కోసం గత ఆర్నెల్లుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారని చెప్పారు. అధికారులు, పోలీసులు వారిపై దాడి చేసి గుడిసెలను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రౌడీలతో బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములున్నా పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదనీ, అవి రియల్ ఎస్టేట్ వ్యాపారులపరం అవుతున్నాయని విమర్శించారు. గుడిసెలు వేసుకున్న వారందరికీ అక్కడే ఇంటి స్థలాల పట్టా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి లేక కాదనీ, రాష్ట్ర ప్రభుత్వానికి మనసు లేకే ఇండ్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం లక్షలాది మంది దరఖాస్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తిస్థాయిలో కట్టలేదనీ, పూర్తయిన వాటినీ లబ్దిదారులకు కేటాయించక పోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. వాటి నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాల్లో అర్హులైన పేదలందరికీ తక్షణం కేటాయించాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ప్రకటించాలని చెప్పారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో వారంరోజులపాటు సర్వేలు, దరఖాస్తులు సమ ర్పించాలని నిర్ణయించామని వివరించారు. వచ్చే నెల మూడో తేదీన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పి స్తామని అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నరసింహారావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి మాట్లాడుతూ 22 జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారని వివరించారు. ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షలతోపాటు కేంద్రం కూడా రూ.ఐదు లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో సొంత ఇండ్లు లేక అసంఘటిత కార్మికులు, పేదలు, మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 58 జీవో ప్రకారం 120 గజాల్లోపు ఉన్న ఇండ్ల స్థలాలను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవి రమణ, కో కన్వీనర్ పి ఆశయ్య, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.