Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దౌర్జన్యమే లక్ష్యంగా మారింది...
- దేశ రాజకీయాల్లో మార్పు తెస్తాం : సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు కానీ ప్రజలు ఓడుతున్నారు...' అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్లలో నిజంగా గెలవాల్సింది ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వారు ప్రజా సేవ చేయాలి.. కానీ ఇప్పుడు దేశంలో కొన్ని పార్టీలకు దౌర్జన్యం చేయటమే లక్ష్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటూ ఆయన ఆకాంక్షించారు. ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్... శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గమాంగ్తోపాటు ఒరిస్సా మాజీ మంత్రి శివరాజ్పాంగి, నాయకులు హేమ గమాంగ, జయరామ్ పాంగి, రామచంద్ర హన్సద, బృందావన్, నబిన్ నందా, రతా దాస్, భగీరథ్ శెట్టి, మయాధర్ జేనా తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సంద ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఎన్నికల్లో ప్రజలు గెలిచే విధంగా దేశ రాజకీయాల్లో మార్పు తెస్తామని అన్నారు. ఈ రకమైన పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ క్రమంలో తనపైనా, తమ పార్టీపైనా చాలా మంది ఇష్టారీతిన విమర్శలు చేస్తా రని వ్యాఖ్యా నించారు. మహారాష్ట్ర ఆర్థికంగా నిలదొక్కుకున్న రాష్ట్ర మని గుర్తు చేశారు. అయితే గతంలో తెలంగాణ నుంచి ఉపాధి కోసం మహా రాష్ట్రకు చాలా మంది వలసెళ్లేవారని వివరించారు. ఆ విధంగా వెళ్లిన వారు ఇప్పుడు వెనక్కి వస్తున్నారని వివరించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు.. రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమైనప్పుడు మహారాష్ట్ర, ఒరిస్సాలో ఎందుకు సాధ్యం కావని ప్రశ్నించారు. ఇవి ఆర్థిక సమస్యలు కాదు.. పాలకుల చిత్తశుద్ధి లోపం వల్ల తలెత్తిన సమస్యలని విమర్శించారు. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై గిరిధర్ గమాంగ్ అనేక పోరాటాలు చేశారని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని క్రియాశీల నాయకుల్లో ఆయన ఒకరని ప్రశంసించారు.