Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారందరి గురించి నేటి తరం తెలుసుకోవాలి : పాలగుమ్మి సాయినాథ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బ్రిటీష్ సామ్రాజ్యవాద వలస పాలన నుంచి దేశ విముక్తి కోసం ఎంతో మంది సామాన్యులు పోరాడారని ప్రముఖ పాత్రికేయులు, రచయిత పాలగుమ్మి సాయినాథ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ' హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ' కోర్ కమిటీ సభ్యురాలు సునీతా రెడ్డి, సాయినాథ్ రచించిన ది లాస్ట్ హీరోస్ ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం పుస్తక విశేషాలపై ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహౌత్స వాలను నిర్వహించిందనీ, అయితే ఆ కార్యక్రమం ద్వారా నేటి తరానికి స్వాతంత్య్ర సమరయోధుల గురించి అవగాహన కల్పించలేకపోయిందని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు, మల్లు స్వరాజ్యం వంటి వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధీరోదాత్తమైన పోరాటాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. ఒరిస్సా బార్గా జిల్లా పానీమోరా ప్రాంతంలో 42 మంది సామాన్యులు పోరాడారని గుర్తుచేశారు. మల్లు స్వరాజ్యం లాంటి వారు తుపాకులు పట్టి పోరాటం నిర్వహించారనీ, ఆమె రజాకార్లకు ధీటుగా నిలబడిన వీరవనిత అని గుర్తుచేశారు. స్వాతంత్య్ర పోరాటం పిడికెడు మందికి పరిమితమైంది కాదనీ, రైతులు, కూలీలు, గృహిణులు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ వారు సైతం తమ తమ పరిధుల్లో బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డారని తెలిపారు. గాంధీయన్లతో పాటు వామపక్షవాదులు, అంబేద్కరిస్టులు, ఆదివాసీలు, దళితులు, ఓబీసీలు, బ్రాహ్మణులు, ముస్లీంలు, సిక్కులు, హిందువులు పోరాటంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. 1947 తర్వాత తరానికి ఈ వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన తరంలో ఇప్పుడు కొద్ది మంది మాత్రమే మిగిలారనీ, వారంతా ఐదారు సంవత్సరాల కన్నా ఎక్కువగా బతికే అవకాశం లేదని చెప్పారు. ఆజాదీ అని నినదించినందుకు ఐదుగురు విద్యార్థులను ఏడాది పాటు జైలుకు పంపిన కేంద్రంలోని బీజేపీ సర్కారు 'ఆజాదీ' అనేది తమ ఆస్తి అయినట్టు ఉత్సవాలు నిర్వహించిందని ఎద్దేవా చేశారు. దామోదర వినాయక సావర్కర్ జైలుకెళ్లేంత వరకూ విప్లవ భావాలు కలిగే ఉన్నారనీ, అనంతరం బ్రిటీష్ ప్రభుత్వంతో రాజీ పడ్డారని తెలిపారు. తనను క్షమిస్తే తప్పుదోవ పట్టిన యువతను తిరిగి బ్రిటీష్ వారికి అనుకూలంగా నడిపిస్తానంటూ నాటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సావర్కర్ రాసిన ఏడు ఉత్తరాల్లో ఐదు ఉత్తరాలు నేషనల్ ఆర్కైవ్‌లో ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పోరాడిన వారిని పట్టుకున్న పోలీసులకు పేర్లు చెప్పేందుకు నిరాకరిస్తే వారి పేర్లను ఎ, బీ, సీ, డీగా రాసుకున్నారనీ, వారిని జైలులో ఉంచేందుకు జైలరు కూడా అనుమతించలేదని వివరించారు.. ప్రజలు తమ చరిత్రను తాము చదువుకోవాలనీ, నిజమైన చరిత్రను తెలుసుకునేందుకు స్వాతంత్య్ర సమరయోధులను కలుసుకుని వారితో ముచ్చటించాలని సూచించారు. ఆ పోరాట వాస్తవ చరిత్రను చెప్పేందుకే తాను పుస్తకం రాసినట్టు తెలిపారు.