Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుద్దాల అశోక్ తేజ
- ముగిసిన బాలోత్సవం
నవతెలంగాణ-ముషీరాబాద్
పిల్లల ప్రతిభాపాటవాలు.. సృజనాత్మకత శక్తికి గీటురాయి తెలంగాణ బాలోత్సవం అని బాలోత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్షులు సుద్దాల అశోక్‌తేజ అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం బాలోత్సవం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండ్రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో 4000 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. 22 అంశాలపై నిర్వహించిన పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నట్టు తెలిపారు. పిల్లల ప్రతిభాపాటవాలను మార్కులతోనో, మూస వార్షిక పరీక్షలతోనో కొలవలేమన్నారు. ఇలాంటి బాలోత్సవాలను పట్టణాల్లోనే కాదు ప్రతి గ్రామానికీ విస్తరింపజేయాలని సూచించారు. బాలోత్సవ గౌరవ అధ్యక్షులు సీహెచ్ వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల కోణం నుంచి ప్రపంచాన్ని చూస్తే కలిగే ఆనందం అనిర్వచనీయమన్నారు. అనుకూలమైన విద్యావిధానం రావాలని చెప్పారు. సైన్స్ ఎగ్జిబిషన్ చూసినప్పుడు పిల్లల ఆలోచనలు, ప్రతిభాపాటవాలు మనకు అందని స్థాయిలో ఉంటాయన్నారు. నేటి తరం విద్యార్థుల్లో అవకాశాలు ఇస్తే ఆకాశాన్ని తాకే శక్తి ఉందన్నారు. విశాలత్వం, సమ భావన, సృజనోత్సవం కలగలిపితే తెలంగాణ బాలోత్సవం అని చెప్పారు. తెలంగాణ బాలోత్సవం అనుభవంతో జిల్లా, మండల, గ్రామస్థాయిలో జరపాలని తీర్మానించారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్, బాలోత్సవం కార్యదర్శి ఎన్.సోమయ్య, ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, అనుముల ప్రభాకర్, జలజ, మమత తదితరులు పాల్గొన్నారు.
భళారే బాలోత్సవ్..
రెండ్రోజుల బాలోత్సవం భళా అనిపించింది. ఎటు చూసినా పిల్లలే.. ఎటు పోయినా వేదికలే.. చిన్నారుల కళలు.. పసిగలాలు.. బుడిబుడి అడుగులు.. బం గారు బొమ్మలు కూచిపూడి నాట్య మయూరాలయ్యాయి. బాలోత్సవంతో సుంద రయ్య విజ్ఞాన కేంద్రం పులకరించిపోయింది. 52 పాఠశాలల నుంచి సుమారు 4000 మంది విద్యార్థులు హాజరు కాగా, 22 రకాల సృజనాత్మక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను 38 మంది న్యాయనిర్ణేతలు సమన్వయం చేశారు.