Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ మధుసూదన్‌రెడ్డి
- ఆన్లైన్ మూల్యాంకనంతో విద్యార్థులకు ఇబ్బందులు
- అధికారులు, అధ్యాపకులకు ఇంకా శిక్షణ ఇవ్వలేదు
- గ్లోబరీనాకు టెండర్ కట్టబెట్టేలా నిబంధనలు
- నవీన్ మిట్టల్‌ను నియంత్రించే శక్తి విద్యామంత్రికి లేదు
- సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యలో ఆన్లైన్ మూల్యాంకనం ద్వారా జరిగే పరిణామాల ద్వారా విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి రాజీనామాకు దారితీసే కుట్ర జరుగుతున్నదని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీజేఎల్ఏ) అధ్యక్షులు పి మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ వ్యవహారంపై మంత్రి ఉదాసీనత వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన్ను నియంత్రించే శక్తి మంత్రికి లేకుండా పోయిందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న జీజేఎల్ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యలో దశలవారీగా ఆన్లైన్ మూల్యాంకనాన్ని చేపడితే బాగుంటుందని చెప్పారు. కానీ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే లాంగ్వేజ్ సబ్జెక్టులకు 20 లక్షలు, ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్) సబ్జెక్టులకు పది లక్షలు, ఒకేషనల్ సబ్జెక్టులకు ఐదు లక్షలు కలిపి మొత్తం 35 లక్షల జవాబుపత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేపట్టాలంటూ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ టెండర్ నోటిఫికేషన్ గురించి అధికారులకు అవగాహన లేదనీ, అధ్యాపకులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అన్నారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయని వివరించారు. మార్చి 15వ తేదీ నుంచి వార్షిక పరీక్షలను నిర్వహిస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఆన్లైన్ మూల్యాంకనంపై అవగాహన కల్పించేందుకు సమయం ఎక్కడుందని ప్రశ్నించారు. తొలుత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టి సత్ఫలితాలు వస్తే మిగిలిన వాటికి అమలు చేస్తే బాగుండేదని సూచించారు. కానీ ప్రస్తుత వార్షిక పరీక్షల్లోనే 50 శాతం జవాబు పత్రాలకు ఆన్లైన్ మూల్యాంకనం నిర్వహిస్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందనీ, వారి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు గ్లోబరీనా సంస్థకు టెండర్ కట్టబెట్టేలా నిబంధనలను రూపొందించారని విమర్శించారు. గతంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన ఆ సంస్థను ప్రభుత్వం, ఇంటర్ బోర్డు బ్లాక్‌లిస్టులో పెట్టలేదనీ, నిషేధించలేదని గుర్తు చేశారు. దీంతో ఇప్పుడు టెండర్‌కు దరఖాస్తు చేసే అర్హత ఆ సంస్థకు ఉందన్నారు. ఇందులోనూ సాంకేతిక విద్యాశాఖాధికారి సూర్యప్రసాద్ జోక్యం ఉందన్నారు. గతంలో గ్లోబరీనాకు ఇంటర్ ఫలితాల ప్రాసెస్ చేసే టెండర్ ఖరారులో ఆయన కీలకంగా పాత్ర వహించారని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో ఇంటర్ విద్య మళ్లీ సంక్షోభంలోకి నెట్టబడుతుందని హెచ్చరించారు. ఇంటర్ బోర్డులో జరుగుతున్న తప్పిదాల గురించి మంత్రి సబితకు వివరించినా నవీన్ మిట్టల్‌పై చర్యలు తీసుకోవడం లేదనీ, ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందువల్ల టెండర్ నోటిఫికేషన్‌పై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ నిబంధనలపై సాంకేతిక నిపుణులతో అధ్యయనం చేయించాలని కోరారు. ఆన్లైన్ మూల్యాంకనం ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.