Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ప్రయివేటు'ను నమ్ముకుంటే నిరుద్యోగం తగ్గదు : ఆర్థిక నిపుణులు
- కోవిడ్ పరిస్థితులు పోయినా..ఉద్యోగుల వేతనాల్లో కోతలు
- అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి.. సమస్యలకు ప్రభుత్వ పెట్టుబడితో చెక్ పెట్టొచ్చు..
ఏ చిన్న ప్లాస్టిక్ వస్తువు కొన్నా..దానిపై వేరే దేశం భాష కనపడుతోంది. భారత్‌లో అమ్ముతోన్న ఆట బొమ్మలు, దుస్తులు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, కార్లు..అనేక ఉత్పత్తుల వెనుకున్నది విదేశీ సంస్థలే. దేశీయ బడా కార్పొరేట్లు ఈ సంస్థల్ని నిర్వహిస్తున్నాయి. వీటికి మన బ్యాంకులు వేల కోట్లు రుణాలు ఇస్తాయి. ఇదీ మోడీ సర్కార్ ఆర్థిక విధానం. మొబైల్ ఫోన్ల తయారీలో అత్యధిక భాగం విదేశాల్లోనే నిర్వహిస్తారు. అసెంబ్లింగ్ భారత్‌లో. ఇది 'మేక్ ఇన్ ఇండియా' లెక్క. ఈ పరిస్థితికి కారణం కేంద్రంలో మోడీ సర్కార్. ప్రయివేటు రంగానికి, బడా కార్పొరేట్లకు ప్రభుత్వ పెట్టుబడుల్ని ఉపయోగిస్తోంది. సరైన ఉపాధి లేక, అధిక ధరలతో, నిరుద్యోగంతో బాధపడటం సామాన్యుడి వంతు అయ్యింది.
న్యూఢిల్లీ : నిరుద్యోగం, అధిక ధరలు, వేతనాల్లో కోతలు...ఇవి నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఈ సమస్యలు తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం మోడీ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు. దీంట్లో మార్పు ఉంటుందా? లేదా? అన్నది కేంద్ర బడ్జెట్ బయటపెడుతుంది. ఒకవేళ మార్చుకుంటే సామాన్యుడికి కొంత ఊరట. లేదంటే సగటు పౌరుడి సమస్యలు తీవ్ర రూపం దాల్చుతాయి. బుధవారం కేంద్ర బడ్జెట్‌ను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నీ 'ద్రవ్య విధానం'తో ముడిపడినవే. ఉపాధి రంగాన్ని మెరుగుపర్చాలన్నా, అధిక ధరల్ని నియంత్రించాలన్నా, వేతనాల్లో కోతల్ని అడ్డుకోవాలన్నా...కేంద్ర బడ్జెటే ప్రధాన ఆయుధం. మోడీ సర్కార్ ఇకనైనా 'ప్రయివేటు' అనుకూల విధానాలు వీడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పట్టాలంటే ఉత్పత్తి, తయారీరంగాన్ని మెరుగుపర్చాలి. ఇందుకు కేంద్రం వద్ద అనేక మార్గాలున్నాయి. నిర్మాణం, మౌలిక వసతులు, సేవారంగాల్లో ప్రభుత్వ పెట్టుబడి ప్రవహించడానికి అనేక పథకాలున్నాయి. ఉదాహరణకు ..ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మకుండా, వాటికి ప్రభుత్వ సహకారం, మద్దతు, కొన్ని నిధులు సమకూరిస్తే చాలు. కొన్ని వేల ఉద్యోగాలు కొత్తవి ఏర్పడతాయి. భారతదేశ వనరులపై విదేశీ పెట్టుబడిదారులు కన్నేసి వుంచారు. విదేశీ వస్తువులు మన మార్కెట్‌ను ముంచెత్తకుండా అడ్డుకోవాల్సి వుంది. ఈ విషయాలన్నీ కొత్త బడ్జెట్ కొంత వరకు బయటపెడుతుంది.
వేతనాల్లో కోతలు..
కోవిడ్ సంక్షోభం తర్వాత వేతనాల్లో కోతలు సర్వసాధారణం అయిపోయింది. 'ఎంతో కొంత ఇస్తున్నాం..తీసుకుంటే తీసుకోండి, లేదంటే పోండి' అని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. కుటుంబ అవసరాలు దృష్టిలో పెట్టుకొని అనేకమంది తక్కువ వేతనాలకు పనిచేయాల్సి వస్తోంది. కోవిడ్ ఆంక్షలు, నిబంధనలు నేడు లేకపోయినా..వేతనాల్లో కోతలు మాత్రం పోలేదు. ఈ పరిస్థితి సుదీర్ఘకాలంగా కొనసాగటం వల్లే మధ్య తరగతి..దారిద్య్రరేఖకు దిగువకు వచ్చేశారు. అప్పులపాలయ్యారు. ఒకప్పుడు అప్పుల బాధ కొన్ని కుటుంబాలకే పరిమితం. నేడు అన్ని కుటుంబాలని ఆవరించింది. దీనికి ముఖ్య కారణం కేంద్రంలోని పాలకుల ఆర్థిక విధానాలే. సామాన్యులు, మధ్య తరగతి, వేతన జీవులు..అందరూ ప్రయివేటు రుణాలపై ఆధారపడటం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది.
మరోవైపు ప్రయివేటు సంస్థలకు, అత్యంత ధనికులు, బడా వ్యాపారులు, కార్పొరేట్లకు తక్కువ వడ్డీల్లో పెద్ద మొత్తంలో రుణాలు అందుతున్నాయి. మోడీ సర్కార్ గుడ్డిగా అనుసరిస్తున్న ఆర్థిక విధానమిది. ఉపాధి కల్పన అంతా ప్రయివేటు చేతుల్లోనే ఉందని, వాటికి మేలు చేసే విధంగా, ప్రయోజనాలు కల్పిస్తూ పోతే..ఉపాధి సమస్య తీరుతుందని మోడీ సర్కార్ గుడ్డిగా నమ్ముతోంది. అదే ఇంత దూరం తీసుకొచ్చింది. ఇలాంటి తరుణంలో వస్తున్న కేంద్ర బడ్జెట్లో మోడీ సర్కార్ తన విధానం మార్చుకుంటుందా? అన్నది అందరూ వేచిచూస్తున్నారు.
ఉపాధి..ఉద్యోగాలు
నిరుద్యోగ సమస్య ప్రతి ఇంటినీ వేధిస్తోంది. మధ్య వయస్సులో నిరుద్యోగిగా మారే వారి సంఖ్య నేడు పెద్ద ఎత్తున ఉంది.
ఈ అంశంపై సీఎంఐఈ నిత్యం గణాంకాల్ని విడుదల చేస్తోంది. ఈ సంస్థ నివేదికల ప్రకారం, గత 41 నెలలుగా సగటు నిరుద్యోగ రేటు 7శాతం పైన్నే ఉంది. డిసెంబర్ 2022లో 8.3శాతం నమోదైంది. కోవిడ్ సంక్షోభం దేశాన్ని తాకకముందు జనవరి 2020లో కార్మికరంగంలో ఉపాధి పొందినవారి సంఖ్య 41.1కోట్లు. కాగా డిసెంబర్, 2022 నాటికి 41కోట్లు. పనిచేసే వయస్సుగల 100 మంది ఉపాధిని కోరుకుంటే ఆనాడు 42.9మందికి ఉపాధి లభించింది. నేడు (డిసెంబర్ 2022) అది 40.5శాతం మాత్రమే ఉంది. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉందన్న విషయం ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్-19 సంక్షోభాలతో సామాన్యుడు విలవిల్లాడిపోయాడు. సంక్షోభ పరిస్థితుల్లో మోడీ సర్కార్ మొహం చాటేసింది. కష్టాలు, నష్టాలు ప్రజలే పరిష్కరించుకుంటారనే వ్యూహం ఎంచుకుంది. ఎన్నికలు...ఓట్ల అవసరం ఉంటేనే ప్రధాని మోడీ మౌనం వీడుతున్నారు.