Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వెనుకంజ
- ఇప్పటికీ కేరళ నెంబర్‌వన్ స్థానమే...
- తమిళనాడు, మహారాష్ట్రలు కొన్ని విషయాల్లో ముందంజ
- ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశం
- వైద్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఏడాది
- వైద్యారోగ్య రంగం 2022 వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ చెప్పుకుంటున్న బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్ వైద్యారోగ్య రంగంలో చివరి స్థానంలో ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ శాఖ 2022 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఛార్జ్‌షీట్ పేరుతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ పనితీరును విమర్శించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ముందు ఆ పార్టీ పాలిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో సేవలెలా ఉన్నాయో తెలుసుకోవాలని హితవు పలికారు. నిటిఅయోగ్ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో కేరళ మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ మూడో స్థానంలో ఉందనీ, రాజస్థాన్ 16వ స్థానంలో ఉంటే, ఛత్తీస్‌ఘడ్ పదో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలించిన సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు లేక డెలివరీలు తగ్గాయనీ, టీఆర్ఎస్ పాలనలో అవి రెట్టింపయ్యాయని చెప్పారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ 2022 వార్షిక నివేదికను ఆ రాష్ట్రాలకు పంపించి అమలు చేయిస్తే మంచిదని సూచించారు. తమిళనాడు, మహారాష్ట్రలు కొన్ని విషయాల్లో తెలంగాణ కన్నా మెరుగ్గా ఉన్నాయంటూ, కేరళతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి ఆయా విషయాలను అధ్య యనం చేసి మన రాష్ట్రంలో అమలు చేయా లని అధికా రులను ఆదేశిం చినట్టు మంత్రి తెలిపారు. చిన్న, చిన్న ఘటనలు మినహా 2022 సంవత్సరం రాష్ట్ర వైద్యారోగ్య చరిత్రలో సువర్ణాక్ష రాలతో లిఖించదగిన ఏడాదని అబిప్రాయపడ్డారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే సమీక్షించు కుంటున్నామనీ, అలాంటివి పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు.
ఎంఎంఆర్ రేట్ 56 నుంచి 43కు, ఐఎంఆర్ రేటు 23 నుంచి 21కి తగ్గించామన్నారు. లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచామనీ, వైద్య పీజీ సీట్ల విషయంలో లక్షకు ఏడు సీట్లతో రెండో స్థానానికి చేరినట్టు వెల్లడించారు. హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, గచ్చిబౌలిలో అదనంగా 1,000 పడకలు,నిమ్స్‌లో 2,000, వరంగల్ సూపర్ స్పెషాలిటీలో మరో 2,000 మొత్తం కలిపి 8,200 బెడ్లు అదనంగా రానున్నాయని తెలిపారు. భూకేటాయింపులు, పనులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. ఔట్ పేషెంట్ల సంఖ్య 60 లక్షలు, ఇన్‌పేషెంట్ల సంఖ్య దాదాపు 3 లక్షలు, సర్జరీలు 50 వేలు పెరిగిందన్నారు. రక్తహీనత ఉన్న గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభించామని చెప్పారు. 926 మంది డాక్టర్ల నియామకం ఒకే రోజు చేశామనీ, తొమ్మిది మెడికల్ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశామనీ, రాష్ట్రంలో 5.40 లక్షల డెలివరీలు జరిగితే అందులో 3.27 లక్షలు (61 శాతం) ప్రభుత్వాస్పత్రుల్లో జరిగాయని తెలిపారు. ఆస్పత్రుల్లో డెలవరీల శాతం 97 నుంచి 99.9 శాతానికి పెరిగిందన్నారు.
ప్రతి మరణంపై ఆడిట్ నిర్వహిస్తున్నామనీ, సీ సెక్షన్‌కు ఇన్సెంటివ్ ఇచ్చే బదులు సహజ ప్రసవాలకు ఇవ్వడాన్ని ప్రారంభించామనీ, దీన్ని కేంద్రం ప్రశంసించి మిగిలిన రాష్ట్రాలు అనుసరించాలని సూచించిందని మంత్రి తెలి పారు. ఇబ్రహీంపట్నం ఘటన తర్వాత ప్రతి ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ టీంలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చా మన్నారు. ప్రభుత్వా స్పత్రుల్లో 716 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయన్నారు. పేషెంట్ డైట్ ఛార్జీలను రూ.40 నుంచి రూ.80కి పెంచామనీ, 18 ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో సహాయ కులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. పారిశుధ్య పనుల నిర్వహణకు ఒక బెడ్‌కు ఇచ్చే రూ.5,000ను రూ.7,500 పెంచామనీ, దేశంలో ఎక్కడా లేని విధంగా డైట్, శానిటేషన్ కాంట్రాక్టులో ఎస్సీ, ఎస్టీలకు 16 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. పరికరాల మరమ్మతులు ఆలస్యం కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు సత్ఫలితాలనిచ్చిందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కింద కుటుంబానికి ఇచ్చే కవరేజీ రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు పెంచామనీ, అవయవమార్పిడి, దీర్ఘకాలిక రోగాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో రూ.10 లక్షల వరకు ఇ్త్నన్నామన్నారు.
12,755 ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నామనీ, 1,047 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, 5,024 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మూడంచెల వైద్య వ్యవస్థ ఐదెంచలుగా మారిందనీ, 2,500 పల్లె దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఆయా విభాగాల్లో పలు అవార్డులు వచ్చాయంటూ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
2023లో సరోజినీదేవి కంటి ఆస్పత్రి, కోఠిలోని ఈఎన్ టీ ఆస్పత్రిలను బలోపేతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆహార కల్తీ నివారణకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ బలోపేతం, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని హరీశ్ రావు తెలిపారు. మలక్ పేట ఘటనపై పై, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం బయటపడితే విధుల్లో నుంచి తొలగిస్తామని తెలిపారు. రెండు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ నిర్వహించామనీ, మిగిలిన జిల్లాల్లోనూ కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.