Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాల్సిందే..
- సేవావృత్తిని పట్టించుకోని ప్రభుత్వం: రౌండ్ టేబుల్ సమావేశంలో పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'రజక వృత్తిదారుల సంక్షేమంపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రజక జనాభాలో 80శాతానికి పైగా ఈ వృత్తిపైన్నే ఆధారపడి బతుకుతున్నారు.సమాజంలో సేవా వృత్తిగా పిలవబడుతున్న రజకుల పట్ల సర్కారు చిన్నచూపు చూడటం సరికాద'ని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేశ్ అధ్యక్షతన '2023-24 రాష్ట్ర బడ్జెట్లో రజక వృత్తిదారుల సంక్షేమానికి వెయ్యి కోట్లు కేటాయించాలి' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ ప్రతి ఏటా బడ్జెట్లో రజకులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగితాల్లో చూపిస్తున్న అరకొర నిధుల్ని కూడా ఖర్చు చేయటం లేదని చెప్పారు. 2017-2020 బడ్జెట్లలో రూ.450 కోట్లు కేటాయించినట్టు ప్రకటించీ, వాటిని విడుదల చేయలేదని తెలిపారు. దోబీఘాట్ల నిర్మాణం కోసం మూడు కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని తెలిపారు. ఎనిమిదేండ్లలో తొమ్మిది దోబీఘాట్లు మాత్రమే కట్టడమేంటని ప్రశ్నించారు. 46దోబీఘాట్ల నిర్మాణానికి దరఖాస్తులు వస్తే..వాటినెందుకు పట్టించుకోవటం లేదో చెప్పాలన్నారు. తరతరాలుగా వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు..కాంట్రాక్టర్లదగ్గర కూలీలుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రులు,విద్యా సంస్థలు, పోలీసు శాఖల బట్టల వాషింగ్, ఇస్త్రీ పనుల్ని వృత్తిదారులకే ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వృత్తి పరంగా ఎలాంటి ఆర్థిక పరమైన మెరుగుదల లేకపోవడంతో వెనుకబాటు, అణచివేత, దోపిడీ, వివక్షతలకు గురౌతున్నారని చెప్పారు. రజక వృత్తిలోకి అనేక కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించటంతో అసలైన వృత్తిదారులు దివాళా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వారందరికీ రుణాలిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం.. 50వేల దరఖాస్తులను బుట్టదాఖలు చేసిందని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో రజకుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన 18, 19, 343, 116, 178, 11, 892, 27 జీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎల్టీ-4కు మార్చి, ఏసీడీ ఛార్జీల భారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రజకుల సామాజిక భద్రతకోసం రక్షణ చట్టం చేయాలన్నారు. ఫెడరేషన్‌కు పాలక వర్గాన్ని నియమించాలనీ, దోబీ ఘాట్ల పరిరక్షణకు ప్రహరీ గోడలు నిర్మించాలనీ, కబ్జాల నుంచి కాపాడాలనీ, వత్తిదారులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలనీ,రూ.5లక్షల జీవితాబీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని పలు తీర్మానాలు చేశారు.
తకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ, సహాయ కార్యదర్శులు సి మల్లేశ్,ఎదునూరు మధార్,పి రాములు, నవీన్, దోబీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సి శంకర్, రాష్ట్ర కమిటి సభ్యులు, ఆయా జిల్లాల నేతలు పాల్గొన్నారు.