Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ పీస్ కౌన్సిల్ అధ్యక్షులు పల్లబ్ సేన్ గుప్తా
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రపంచంలోని ప్రజలకు శాంతి అవసరమని, అది లేకుండా అభివృద్ధి, సామాజిక న్యాయం, మంచి భవిష్యత్తు సాధ్యం కాదని వరల్డ్ పీస్ కౌన్సిల్ అంతర్జాతీయ అధ్యక్షులు పల్లబ్ సేన్ గుప్తా తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై సామ్రాజ్యవాద శక్తులు బెదిరింపులు పాల్పడుతూ ఆంక్షలు విధించడం వల్ల క్యూబా లాంటి అనేక దేశాలు ప్రమాదకరమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయని అన్నారు. యుద్దాలు ప్రపంచవ్యాప్తంగా మానవ జీవన వ్యయ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత శాంతి, సంఘీభావ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇటీవల వరల్డ్ పీస్ కౌన్సిల్ అంతర్జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన పల్లబ్ సేన్ గుప్తాను సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త శాలువా, గజ పూలమాలతో హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని హౌటల్ మినర్వాలో ఘనంగా సత్కరించి, జ్ఞాపకను అందజేశారు. ఈ సందర్బంగా పల్లబ్ సేన్ గుప్తా మాట్లాడుతూ.. ఐక్య రాజ్యసమితి గుర్తింపు పొందిన వరల్డ్ పీస్ కౌన్సిల్ 'శాంతికి అవును, యుద్ధానికి కాదు' అన్న నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పని చేస్తుందని తెలిపారు. నిజమైన శాంతిని విశ్వసించే దేశాలు అంతర్జాతీయ సహకారం అందిస్తాయని, సామ్రాజ్యవాద దేశాలు ఆంక్షలు, యుద్ధాలను ప్రోత్సహిస్తాయన్నారు. క్యూబాపై అమెరికా నిర్బంధాన్ని వెంటనే ముగించాలని డిమాండ్ చేశారు. ఐరోపాలో జీవన పరిస్థితులు దిగజారుతున్నట్టు రుజువులు కనిపిస్తున్న నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ దేశాలు వెంటనే యుద్దాలు అపి, శాంతీయుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఫాసిస్ట్ చర్యలు ప్రారంభమయ్యాయని, ప్రజాస్వామ్య రక్షణకై, వారి హక్కులు, సామాజిక పురోగతి కోసం శాంతియుతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యుద్ధాలకు ముగింపు పలకాలని, శాంతిని రక్షించాలని, శరణార్థులు, వలసదారుల హక్కులను కాపాడాలని వరల్డ్ పీస్ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్యెల్సీ కె.యాదవరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డా.దిడ్డి సుధాకర్, ఐప్సో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఏం.ఆర్.జి.వినోద్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు పి.ఎల్.శ్రీనివాస్, లోకసత్తా ఉపాధ్యక్షులు మెట్ల జగన్, ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, రాష్ట్ర నాయకులు తిప్పర్తి యాదయ్య, కాచం సత్యనారాయణ గుప్త, నాగేశ్వర్ రావు, ప్రముఖ సినీనటి ప్రీతి నిగమ్, ఐపీసో నాయకులు ఉమా మహేష్, బచ్చన్ సింగ్, టి.రాకేష్, జగన్ మోహన్ రావు, రఘుపాల్, నాగిరెడ్డి, కర్ర నగేష్ తదితరులు పాల్గొన్నారు.