Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంటర్మీడియట్ విద్యలో ఆన్లైన్ మూల్యాంకనం చేయాలనే విద్యాశాఖ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి పేర్కొంది. ఆదివారం ఈ మేరకు ఆ సమితి రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, సమన్వయకర్త మైలారం జంగయ్య, ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, సమితి కోకన్వీనర్లు లక్ష్మయ్య, మంజునాయక్, పరశురాములు, సైదులు, చంద్రయ్య, డాక్టర్ వస్కుల శ్రీనివాస్, పీఆర్వో శోభన్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటగా లాంగ్వేజ్, హ్యుమానిటీస్ సబ్జెక్టులపై ప్రయోగాత్మకంగా చేపట్టనుండటం శుభపరిణామం అని పేర్కొన్నారు. దీనివల్ల బోర్డుకు అనవసరపు ఖర్చులు తగ్గుతాయనీ, విద్యార్థులకు నష్టం జరుగకుండా కచ్చితమైన మూల్యాంకనం చేయడం వలన ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. మార్కుల విషయంలో ఏమైనా హెచ్చుతగ్గులు వచ్చాయని భావిస్తే తక్షణమే వారి పేపర్‌ను వెంబడే డౌన్ లోడ్ చేసుకొని వారికున్న సందేహాలను తీర్చుకోవచ్చునని పేర్కొన్నారు. ఆన్ లైన్ మూల్యాంకనంపై కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేయడం తగదనీ, విద్యార్థులను అనవసరపు ఆందోళనలకు గురిచేయొద్దని కోరారు. ఇంటర్మీడియట్ విద్యలో పనిచేసే అధ్యాపకులందరూ వారివారి సబ్జెక్టులలో పోస్టు గ్రాడ్యుయేట్స్, స్మార్టుఫోన్, ల్యాప్ ట్యాబ్, కంప్యూటర్ వాడటంలో మంచి అనుభవం వున్న వారే కావడం వలన అధ్యాపకులకు ''ఆన్ లైన్'' మూల్యాంకనంలో అవగాహన కల్పించడానికి మూడు, నాలుగు రోజుల సమయం సరిపోతుందని తెలిపారు.