Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- ఐద్వా సిరిసిల్ల జిల్లా కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ - తంగళ్ళపల్లి
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివై.నగర్లో ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) జిల్లా కార్యాలయాన్ని మల్లు లక్ష్మి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళా పొదుపు సంఘాలకు రావాల్సిన పావలా వడ్డీ రుణాల బకాయిలను వెంటనే చెల్లించి, వడ్డీ లేని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అణచివేతలకు వ్యతిరేకంగా వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం ఐద్వా అని తెలిపారు. మద్యపాన నిషేధం విధించాలని, ప్రజలందరికీ విద్యా, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహిళల రక్షణ, భద్రతకు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన నిరుపేదలందరికీ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందిం చాలని, మిగిలిన వారందరికీ ఇంటి స్థలం, రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజాసంఘాల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న చేపట్టిన చలో హైదరాబాద్ ధర్నాలో మహిళ లందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు సూరం పద్మ, జిల్లా కార్యదర్శి జవాజి విమల, నాయకులు వడ్ల లక్ష్మి, గట్ల స్వప్న, సామల కవిత, కృష్ణవేణి, శారద, భాగ్యలక్ష్మి, రూప, పూజ, మంజుల, అంబవ్వ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.