Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుకు గురైన వారికీ ఉపయోగం
- డాక్టర్ మురళీధర్ బాబీ
- మారథాన్‌లో పాల్గొన్న 20 మంది గుండె రోగులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్డియాక్ రిహాబ్ గుండెకు తగిన బలాన్నిస్తుందనీ, గుండెపోటుకు గురైన వారికి ఉపయోగకరంగా ఉందని స్వచ్ఛంద సేవా సంస్థ కార్డియాక్ రిహాబ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాక్ రిహాబ్ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీధర్ బాబీ తెలిపారు. ఆదివారం ఇనార్బిట్ మాల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద నిర్వహించిన రన్లో 20 మంది గుండె సంబంధిత రోగులు పాల్గొన్నారు. గతంలో గుండె జబ్బులు, శస్త్రచికిత్సలు జరిగాయంటే పడకకు, ఇంటికి పరిమితమయ్యేవారు. బరువైన పనులు, పరుగులు పెట్టేందుకు ఇబ్బందులు పడే వారు. కానీ కార్డియాక్ రిహాబ్ అందుబాటులోకి వచ్చాక ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు వారు వరుసగా మారథాన్లలో పాల్గొంటున్నారు. కార్డియాక్ రిహాబ్ రన్నర్లలో ఇప్పటికే హార్ట్ అటాక్ గురై కోలుకున్న వారు, యాంజియోప్లాస్టీ అయినవారు, బైపాస్, మైనర్ బ్లాక్‌లతో పాటు డయాలెటెడ్ కార్డియోమైయోపతీ (డీసీఎం), పల్మనరీ ఆర్టియల్ హైపర్ టెన్షన్ (పీఏహెచ్) రోగులుండడం గమనార్హం. వీరంతా మూడు నుంచి ఆరు నెలలపాటు గుండె వ్యాయామాలు చేసి దాని పంపింగ్ సామర్థ్యాన్ని పెంచుకుని కుటుంబంలో అందరి కన్నా ఫిట్నెస్గా మారి మారథాన్ లలో పాల్గొంటుండటం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ మురళీధర్ బాబీ మాట్లాడుతూ కార్డియాక్ రిహాబ్ తో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు.
డయాబెటీస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోతుందనీ, హై బ్లడ్ ప్రెషర్ వారికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుందనీ, ఆత్మస్థైర్యం పెరిగి మెరుగైన జీవితం లభిస్తుందని తెలిపారు. రిహాబ్‌లో వ్యాయామాలు చేసిన తర్వాత అయిన మూడు నెలల తర్వాత రిహాబ్ అయిన మూడు నెలల తర్వాత వీరిలో షుగర్, బీపీ తగ్గిపోవడం, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్ల నుంచి బయటికి రావడమే కాకుండా శారీరకంగా చాలా ఫిట్‌గా అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఏయస్ అధికారి జమేష్రంజన్ తదితరులు పాల్గొన్నారు.