Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీడీ చార్జీలు వసూలు చేసే చట్టం లేదు
- కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
నవతెలంగాణ- జగిత్యాల
తెలంగాణలో ఎక్కడైనా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్టయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగదారుల నుంచి ఏడీసీ చార్జీలు వసూలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. రైతులకు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల విద్యుత్ ఏసీడీ బిల్ తీసుకు వచ్చిందన్నారు. 300 యూనిట్లు లోపల ఉన్న నిరుపేద వర్గాలైన వారిపై పన్ను వేస్తున్నారని, ఇది ఒక ఎన్పీడీసీఎల్లో మాత్రమే ఉందని, ఉత్తర తెలంగాణ వినియోగదారులు తెలంగాణ బిడ్డలు కాదా అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణలో ఎసీడీ చార్జీలు లేవని, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలోని ఎర్రవెల్లిలో, ఆయన కొడుకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఏసీడీ బిల్లు వసూలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 110 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడే తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించలేని అసమర్థుడు కేసీఆర్ అని ఆరోపించారు. ఈ నెల 31న విద్యుత్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల ఎస్ఈ కార్యాల యాన్ని ముట్టడిస్తామని తెలిపారు. పసుపు బోర్డు లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానన్న ఎంపీ అరవింద్ సాధించలేకపోయారని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకోవడం తప్ప రైతుల సమస్యలు పరిష్కరించడం లేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యే, ఎంపీ దేనికైనా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. ఈ సమా వేశంలో డీసీసీ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మెన్ గిరి నాగ భూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.