Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారంపల్లి, సత్యబాబు బోస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ(పీఎంసీ) జాతీయ కన్వీనర్ బీడీఏ సత్యబాబు బోస్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అగ్రి నెట్వర్క్, సీబీజీఏ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కనీసం పదిశాతానికి పైగా కేటాయిం చాలని డిమాండ్ చేశారు వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళ, పక్కనున్న కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు రైతులు పండించిన ధాన్యానికి ఇస్తున్న మాది రిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. వీటి కోసం ప్రత్యే కంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతుల పండించే పంటలకు కనీస మద్దతుధర అమలు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలనీ, పూర్తి సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు అందించేందుకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ప్రసాద్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు క్షేత్రస్థాయి నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకోవాలనీ, అందుకు వ్యవసాయ రంగంలో పని చేస్తున్న సంఘాలు, సంస్థలు, రైతు సంఘాలు, రైతులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. కౌలు,పోడు సాగుదారులకు రైతుబంధు, రైతు బీమా వర్తింపజేయాలని అన్నారు. వలసలు నివారించేలా వ్యవసాయ విధానాలు తీసుకురావాలనీ, పట్టణ పేదలకు ప్రత్యేకంగా పని కల్పించేందుకు కేరళ తరహాలో రూ. 1000 కోట్లు 'పట్టణ ఉపాధి హామీ' కోసం కేటాయించాలన్నారు. నిత్యవసర ధరల నియంత్రణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ ప్రాజెక్టుల కోసం సేకరిస్తున్న భూసేకరణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికులు వత్తిదారులను ఆదుకొనేందుకు ప్రత్యేక ప్యాకేజీకి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు తెల్లరేషన్ కార్డుదారులకు సబ్సిడీ బియ్యం అందించేందుకు రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలనీ, 14 రకాల నిత్యావసర సరుకులు అందించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం పునరావాసం కల్పించాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇవ్వాలని కోరారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఉపాధి కల్పించేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు అనంతరం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24పై రైతుల ఆకాంక్షల నివేదిక విడుదల చేశారు. కార్యక్రమానికి తెలంగాణా అగ్రి నెట్వర్క్, సీబీజీఏ రాష్ట్ర సమన్వయకర్త సురుపంగ శివలింగం అధ్యక్షత వహించారు. సీబీజీఏ ప్రతినిధి సోమశేఖర్, పీఎంసీ నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.