Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల సౌకర్యార్థం బీటి రోడ్డు వేయాల్సిందే..
- చివరి బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలి: సీపీఐ(ఎం) నేతలు జూలకంటి, ముదిరెడ్డి డిమాండ్
- పాములపాడు నుంచి మాడుగులపల్లి వరకు పాదయాత్ర
నవతెలంగాణ-మిర్యాలగూడ
పాములపాడు నుంచి మాడుగులపల్లి వరకు డబుల్ బీటీ రోడ్డు వేసే వరకు పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామం నుంచి పాదయాత్రను వారు ప్రారంభించారు. అక్కడి నుంచి పాదయాత్ర పోరెడ్డిగూడెం, చిరుమర్ది, అగామోత్కూర్, గుర్రపుగూడెం శివారు, ఇందుగుల, మడుగులపల్లి వరకు 18 కిలోమీటర్ల వరకు సాగింది. ఆయా గ్రామాల్లో గ్రామస్థులు ఎదురెళ్లి పాదయాత్ర నాయకులకు తిలకం దిద్ది స్వాగతం పలికారు. 'ఇన్నాండ్లు మా సమస్యలు ఎవరూ పట్టించుకోలేదు.. మీరు మా సమస్యపై పాదయాత్ర చేయడం సంతోషకరం' అని ఆయా గ్రామాల ప్రజలు పాదయాత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపి పాదయాత్రలో నడిచారు. సాయంత్రం వరకు పాదయాత్ర మాడుగులపల్లికి చేరుకుంది. డప్పు వాయిద్యాల నడుమ ప్రజల మద్దతుతో పాదయాత్ర ఉత్సాహభరితంగా సాగింది. చిరుమర్తి గ్రామంలో సర్పంచ్ నాంపల్లి శ్రీశైలం పాదయాత్ర బృందానికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. గ్రామ శివారు వరకు ఆయన పాదయాత్రతో నడిచి మద్దతు తెలిపారు. ఇందుగుల గ్రామస్తులు పెద్దఎత్తున పాదయాత్రలో కలిసి నడిచారు.
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మాడుగులపల్లి నుంచి పాములపాడు వరకు 18 కిలోమీటర్లు, అదనంగా మరో నాలుగు కిలోమీటర్లు భీమారం వరకు డబుల్ బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. వామపక్ష నాయకులు ప్రాతినిధ్యమున్న సమయంలో సింగిల్ రోడ్డు వేశారని, ఇప్పటివరకు డబుల్ రోడ్డుకు నోచుకోలేదన్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాలకు ఈ రోడ్డు ప్రధానమైందని చెప్పారు. డబుల్ రోడ్డు వేయడం వల్ల పది నుంచి 12 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం బస్సులు, లారీలు, ఆటోలు ఇతర వాహనాలు పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయని, దీనివల్ల రద్దీ పెరిగి రోడ్డు సరిపోవడం లేదన్నారు. ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. రోడ్డు చిన్నగా ఉండటం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతు న్నాయని చెప్పారు.
దానికితోడు రోడ్డు అంతా గుంతలమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ రోడ్డు కోసం అనేకసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి వివరించామని, అయినా స్పందించకపోవడంతోనే పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. తమది ఉద్యమాల పార్టీ అని, ప్రజాసమస్యల ఎజెండాగా ఉద్యమాలు చేస్తామని, ఓట్లు సీట్లు లెక్క కావని స్పష్టం చేశారు.
ప్రజల పక్షాన పోరాడేందుకు తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఇది ఎన్నికల సంవత్సరమని, రాష్ట్ర ప్రభుత్వం చివరిగా ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనికోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. డబుల్ రోడ్డు వేసే వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పాదూరి శశిధర్ రెడ్డి, చౌగాని సీతారాములు, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదురి గోవర్ధన, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రొంది శ్రీనివాస్, సహాయ కార్యదర్శి శ్రీకర్, నాయకులు అశోక్‌రెడ్డి, పాల్వాయి రామిరెడ్డి, తంగేళ్ల నాగమణి, రేమిడల బిక్షం, బొంగర్ల వెంకటయ్య, ఇందిరా, మంగమ్మ, లక్మి తదితరులు పాల్గొన్నారు.