Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్. వీరయ్య
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసిన నిరుపేదల పోరాటానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్. వీరయ్య తెలిపారు. గుడిసె వాసుల పోరాటానికి మద్దతు తెలుపుతూ సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన వీరయ్య వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడి భూమి ఏ భూస్వామికి చెందినది కాదని, 40 ఏండ్లుగా కాస్తు కబ్జాలో లేరని 2022 జూన్లో ఏటూరునాగారం ఐటీడీఏ పీిఓ తీర్పు ఇచ్చినా భూస్వాముల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గుడిసె వాసుల కమిటీలపై, తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి బెదిరిస్తున్నారని అన్నారు. సర్వే నెంబర్-109లో 20 ఏండ్లుగా పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించిందని, భూస్వాములను తరిమికొట్టైనా ఈ భూమి మీదకు రాకుండా ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా జక్కులుద్దిలో గుడిసెలేసుకున్న వారిపై తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేశారని, గర్భిణులను సైతం కొట్టారని, అయినా అన్ని దాడులను ఎదుర్కొంటూ గుడిసె వాసులు పోరాడుతున్నారని, వారి పోరాటానికి సీపీఐ(ఎం) అండగా ఉందని గుర్తుచేశారు. పస్రాలో పోరాటానికి రాష్ట్ర ప్రజా సంఘాల ఐక్యవేదిక అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 60 కేంద్రాల్లో పేదలు ఇండస్థలాల కోసం పోరాటం నిర్వహిస్తున్నారని, వారందరికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీ మేరకు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గానీ, ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు గానీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుడిసె వాసులకు పట్టాలు వచ్చేవరకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కాసు మాధవి, వ్యకాస రాష్ట్ర నాయకులు బి రెడ్డి సాంబశివ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిళ్ల చిట్టిబాబు, తీగల ఆదిరెడ్డి, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.